
Omicron: జపాన్కూ పాకిన ఒమిక్రాన్.. విదేశీయుల రాకపై నిషేధం రోజే నిర్ధారణ!
టోక్యో: దక్షిణాఫ్రికాలో బయటపడిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా తదితర దేశాల్లో కలకలం రేపిన ఈ వేరియంట్.. తాజాగా జపాన్కూ పాకింది. తమ దేశంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కానప్పటికీ సరిహద్దులను మూసివేస్తున్నాం.. మంగళవారం నుంచి విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నామంటూ జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించిన మరుసటి రోజే ఈ వేరియంట్ తొలి కేసు బయటపడటం గమనార్హం. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నమీబియా నుంచి వచ్చిన వ్యక్తిలో..
‘నమీబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి శాంపిళ్లను పరీక్షించగా.. ఒమిక్రాన్ రకం కేసుగా నిర్థారణ అయింది’ అని ప్రభుత్వ ప్రతినిధి హిరోకాజు మట్సునో వెల్లడించారు. ఇది జపాన్లో నమోదైన మొదటి ఒమిక్రాన్ కేసు అని ఆయన పేర్కొన్నారు. 30ఏళ్ల వయసున్న సంబంధిత వ్యక్తిని ప్రస్తుతం ఐసొలేషన్లో ఉంచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. కొత్త వేరియంట్ కట్టడి కోసం జపాన్ నేటినుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. జపాన్ పౌరులు, ఇప్పటికే ఇక్కడ ఉంటున్న విదేశీయులకు మాత్రమే దేశంలోకి అనుమతి ఉంది.