Flight: విమానంలో మహిళా సిబ్బందికి లైంగిక వేధింపులు.. ప్రయాణికుడి అరెస్ట్‌

విమానంలో ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 21 Aug 2023 16:42 IST

బెంగళూరు: విమానాల్లో (Flights) మహిళా సిబ్బంది (Airhostess)పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాలే (Male) నుంచి బెంగళూరు (Bengaluru) బయల్దేరిన విమానంలో ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఫిర్యాదు చేయడంతో ప్రయాణికుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం..

ఇండిగో ఫ్లైట్‌ 6ఈ 1128 విమానం శుక్రవారం తెల్లవారుజామున మాలే నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానంలో మాల్దీవులకు చెందిన అక్రమ్‌ అహ్మద్‌ అనే ప్రయాణికుడు మద్యం కావాలని మహిళా సిబ్బందిని కోరాడు. అతనికి మద్యం గ్లాసు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆమెను అసభ్యకర రీతిలో తాకుతూ వేధింపులకు గురిచేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ్‌ ప్రవర్తనను గమనించి ప్రశ్నించేందుకు వచ్చిన మిగతా మహిళా సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ వారిని కూడా లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. విమానం బెంగళూరు చేరుకున్న అనంతరం మహిళా సిబ్బంది సీఐఎస్‌ఎఫ్‌ (CISF) అధికారులకు సమాచారం అందించడంతో అక్రమ్‌ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఇండిగో సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

లిఫ్ట్‌లో ఇరుక్కున్న చిన్నారి.. తాపీగా హోంవర్క్‌ చేసుకుంటూ..

కొద్దిరోజులు క్రితం దిల్లీ నుంచి ముంబయి వెళుతున్న స్పైస్‌జెట్‌ విమానంలో ఓ ప్రయాణికుడు మహిళా క్యాబిన్‌ సిబ్బందితోపాటు, తోటి మహిళా ప్రయాణికులను లైంగిక వేధింపులకు గురిచేశాడు. వారిని అనుచిత రీతిలో ఫొటోలు/వీడియోలు తీస్తూ వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో దిల్లీ పోలీస్‌ (Delhi Police), పౌర విమానయాన సంస్థ (DGCA)లకు దిల్లీ మహిళా కమిషన్‌ (DCW) నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు