ఆందోళన చేయడమనేది ప్రతి పౌరుడి హక్కు..

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ జామా మసీదు వద్ద ఆందోళన చేయడాన్ని తప్పుబట్టిన దిల్లీ పోలీసుల తీరుపై తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆజాద్ బెయిల్‌

Published : 14 Jan 2020 19:49 IST

ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా దిల్లీ పోలీసుల తీరుపై జడ్జి ఫైర్‌

దిల్లీ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ జామా మసీదు వద్ద ఆందోళన చేయడాన్ని తప్పుబట్టిన దిల్లీ పోలీసుల తీరుపై తీస్ హజారీ కోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ఆజాద్ బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన న్యాయమూర్తి.. జామా మసీదు ఏమైనా పాక్‌లో ఉందా? అంటూ పోలీసులకు మొట్టికాయలు వేశారు. 

జామా మసీదు వద్ద ఆందోళన చేపట్టేందుకు ఆజాద్‌ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విచారణ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి కామిని లౌ స్పందిస్తూ.. ‘ఏ అనుమతి తీసుకోవాలి? సెక్షన్‌ 144ను పదేపదే ఉపయోగించడం నేరమని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. చాలా ఘటనల్లో చాలా మంది ఆందోళన చేయడం సహజమే. అంతెందుకు పార్లమెంట్‌ ముందు కూడా నిరసనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. ఇందులో సీనియర్‌ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీరు(పోలీసులను ఉద్దేశిస్తూ) రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివారా..? ఆందోళన చేయడం అనేది ప్రతి పౌరుడి రాజకీయ హక్కు. అలాంటప్పుడు జామా మసీదు వద్ద నిరసన చేపడితే తప్పేంటీ? జామా మసీదు పాకిస్థాన్‌లో ఉన్నట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ పాకిస్థాన్‌లో ఉన్నా.. అక్కడకు వెళ్లి కూడా శాంతియుత ఆందోళన చేయొచ్చు. ఎందుకంటే పాక్‌ కూడా ఒకప్పుడు అవిభాజ్య భారత్‌లో భాగమే’ అని చెప్పుకొచ్చారు. 

జామా మసీదు వద్ద ఆజాద్‌ ఏమైనా నేరపూరిత ప్రసంగాలు చేశారా అని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. ఒకవేళ అలా చేసి ఉంటే అందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఆజాద్‌ బెయిల్‌పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత నెల 20న ఆజాద్‌ నేతృత్వంలోని భీమ్‌ ఆర్మీ జామా మసీదు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మసీదు నుంచి జంతర్‌ మంతర్‌ వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ర్యాలీకి బయల్దేరగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆజాద్‌ సహా మరికొందరిని అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని