‘చిట్టితల్లీ.. నిన్ను మళ్లీ చూశానమ్మా’

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ ఏడేళ్లకే దూరమైతే ఆ తల్లి పడే కడుపుకోత వర్ణనాతీతం. రోజులు గడుస్తున్నా ఆ బాధ గుండె లోతుల్లో వెంటాడుతూనే ఉంటుంది. అలాంటిది చనిపోయిన కూతుర్నీ

Published : 15 Feb 2020 17:09 IST

వీఆర్‌తో చనిపోయిన కుమార్తెను కలుసుకున్న తల్లి

సియోల్‌: అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ ఏడేళ్లకే దూరమైతే ఆ తల్లి పడే కడుపుకోత వర్ణనాతీతం. రోజులు గడుస్తున్నా ఆ బాధ గుండె లోతుల్లో వెంటాడుతూనే ఉంటుంది. అలాంటిది చనిపోయిన కూతుర్ని మళ్లీ కలుసుకునే అవకాశం వస్తే.. ఆ కన్నపేగు ఉప్పొంగిపోతుంది. ఆ అనుభూతినే ఓ తల్లికి అందించింది దక్షిణ కొరియాకు చెందిన టీవీ ఛానల్‌. మన జీవితంలో నుంచి శాశ్వతంగా దూరమైన వ్యక్తులను మళ్లీ కలుసుకునే అవకాశం నిజ జీవితంలో సాధ్యం కాకపోయినప్పటికీ వర్చువల్‌ రియాల్టీతో ఓ తల్లి తన చనిపోయిన కుమార్తెను కలిసేలా చేసింది ఆ టీవీ ఛానల్‌.

ఓ కొరియన్‌ టీవీ ఛానల్‌ కొన్ని నెలల నుంచి ‘మీటింగ్‌ యు’ అనే పేరుతో ఒక షో నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి నాలుగేళ్ల క్రితం చనిపోయిన తన కుమార్తె నా ఇయాన్‌ను కలుసుకుని, చిన్నారితో మాట్లాడే అవకాశం కల్పించింది. ఈ షోలో జాంగ్‌ మైదానంలోకి వెళ్లగానే ఏడేళ్ల తన కుమార్తె అమ్మా అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు కన్పించింది. కన్నబిడ్డ కనబడగానే ఆ తల్లి ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. అప్పుడా చిన్నారి తన తల్లితో..‘అసలు నేను గుర్తున్నానా.. ఇంతకాలం ఎక్కడకు వెళ్లిపోవాయ్‌’ అని అమాయకంగా అడగటంతో జాంగ్‌ తీవ్ర భావోద్వేగానికి గురైంది. 

‘నిన్నెలా మర్చిపోతాను తల్లి’ అంటూ ఏడుస్తూ బదులిచ్చింది. నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ కూతుర్ని పట్టుకుని తల నిమిరేందుకు జాంగ్‌ ప్రయత్నించింది. అయితే యానిమేటెడ్‌ రూపంలో ఉన్న బిడ్డను ఆమె పట్టుకోలేకపోతుంది. ‘నిన్ను ఒక్కసారి తాకాలని ఉంది తల్లి’ అని జాంగ్‌ రోదించడం చూసి అక్కడే ఉన్న ఆమె భర్త, మిగతా పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. 

నిజానికి వర్చువల్ రియాల్టీ ద్వారా ఇది సాధ్యమైంది. స్టూడియోలో జాంగ్‌ తన ముఖానికి డిజిటల్‌ కెమెరా, చేతులకు టచ్‌ సెన్సిటివ్‌ గ్లోవ్స్‌ ధరించి ఆకుపచ్చని తెర ముందు నిల్చుంది. ఆ కెమెరాలోని సాంకేతికత ద్వారా చిన్నారి నిజంగానే తన ముందుకు వచ్చినట్లు, తనతో మాట్లాడినట్లు అనుభూతిని పొందింది. ఈ వీడియో ఇటీవల యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెట్టింట ఎందరో హృదయాలను హత్తుకుంది.  చనిపోయిన కుమార్తె కళ్లముందు కనబడగానే తల్లి పొందే ఉద్వేగం, చిన్నారిని తాకలేక ఆ తల్లి రోదించడం వీక్షకులను కంటతడి పెట్టించింది. 

2016లో జాంగ్ కుమార్తె తన ఏడేళ్ల వయసులో లుకేమియాతో బాధపడుతూ చనిపోయింది. నాలుగేళ్ల తర్వాత తన పాపను కలిసేలా చేసిన కొరియన్‌ టీవీకి జాంగ్‌  మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని