లైసెన్స్‌ వచ్చింది..కారుతో నదిలో పడ్డాడు!

ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడపటం ఎంతో ప్రమాదకరం అని ఎంతగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. అలా అనుకోని ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. తాజాగా.....

Published : 07 Mar 2020 00:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ కారు నడపటం ఎంతో ప్రమాదకరం అని ఎంతగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. అనుకోని ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. తాజాగా చైనాలోని జునాయి నగరంలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కారు నడపటంతో వంతెనపై నుంచి జారి నదిలోకి పడిపోయాడు. నదిలో నీరు తక్కువగా ఉండటంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్‌ పొందిన పది నిమిషాలకు ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటనను జునాయి ట్రాఫిక్‌ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్‌ అయ్యింది.

జాంగ్ అనే వ్యక్తి కారు నడుపుతూ సెల్‌ఫోన్‌ చూసుకొనే క్రమంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీని గురించి జాంగ్ మాట్లాడుతూ ‘‘నేను కారు నడిపే సమయంలో ఫోన్ ఆపరేట్ చేద్దామని ప్రయత్నించాను. అయితే ఆ సమయంలో నాకు ఎదురుగా ఇద్దరు వ్యక్తులు రావడంతో స్టీరింగ్‌ను ఎడమవైపు తిప్పడంతో వంతెనపై నుంచి కారు నదిలోకి పడిపోయింది. నేను డ్రైవింగ్ పరీక్ష పాసై తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకొంది’’ అని తెలిపారు.

అయితే కారు నదిలో పడిన వెంటనే అప్రమత్తమయిన జాంగ్ కారు డోరు తెరుచుకొని బయటికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకొన్న పోలీసులు క్రేన్‌ సహాయంతో జాంగ్‌ను, కారును బయటికి తీశారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనతో మరోసారి రుజువయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని