ఆ పోస్టర్లు తొలగించండి: అలహాబాద్‌ హైకోర్టు

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారి చిత్రాలతో ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని.........

Published : 09 Mar 2020 21:40 IST

లఖ్‌నవూ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారి చిత్రాలతో ఏర్పాటు చేసిన పోస్టర్లను తొలగించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. మార్చి 16 లోగా వాటిని తొలగించాలని లఖ్‌నవూ జిల్లా మేజిస్ట్రేట్‌, డివిజనల్‌ కమిషనర్‌కు సూచించింది. యూపీలో సీఏఏ ఆందోళనల్లో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల చిత్రాలతో యూపీ ప్రభుత్వం పోస్టర్లను ఏర్పాటు చేయడాన్ని అలహాబాద్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

దీనిపై సోమవారం విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం యూపీ ప్రభుత్వ అధికారుల చర్యను తప్పుపట్టింది. సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించింది. పోస్టర్ల తొలగింపు అనంతరం మార్చి 16లోగా రిజిస్ట్రార్‌ జనరల్‌కు సంబంధిత నివేదికను సమర్పించాలని ఆదేశించింది. సీఏఏను నిరసిస్తూ డిసెంబర్‌లో లఖ్‌నవూలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పరిహారాన్ని వసూలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారి పేర్లు, ఫొటోలతో కూడిన పోస్టర్లు, హోర్డింగులను నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని