కరోనా ఎఫెక్ట్‌: దేవుళ్ల విగ్రహాలకు మాస్క్‌లు

యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (కొవిడ్‌ 19) కలవర పెడుతోంది. ఈ వైరస్‌ పంజా విసిరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 4076 మంది మృత్యువాత పడగా.. 1,14,720 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.......

Updated : 12 Mar 2020 10:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి (కొవిడ్‌ 19) కలవర పెడుతోంది. ఈ వైరస్‌ పంజా విసిరడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 4076 మంది మృత్యువాత పడగా.. 1,14,720 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చైనాలో విజృంభించిన ఈ ప్రాణాంతక మహమ్మారి క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ ఆయా దేశాల ఆర్థిక, పర్యాటక రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనాలో ఈ కేసులు నెమ్మదిస్తున్నా.. ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 56 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‌లో క్రమంగా కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ప్రజలు చేతులు కడుక్కోవడంతో పాటు మాస్క్‌లు ధరిస్తూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు, వారణాసిలోని ప్రహ్లాదేశ్వరస్వామి ఆలయంలోని పలు విగ్రహాలకు సైతం అక్కడి పూజారులు మాస్క్‌లు ధరించడం అక్కడి భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

చైనాలో తగ్గుముఖం.. నర్సుల గంతులు

వుహాన్‌: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్‌ వంద దేశాలకుపైగా వ్యాపించి తన వ్యాప్తిని కొనసాగిస్తోంది. ఒక్క చైనాలోనే దాదాపు 3200 మంది ప్రాణాలను బలితీసుకోగా మరో 80వేల మందికి పైగా పీడిస్తోందీ మహమ్మారి. ఈ సమయంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. కరోనాపై యుద్ధం ప్రకటించిన చైనా.. అక్కడ దీని తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించి వేల సంఖ్యలో పడకలను సిద్ధం చేసింది. అనుక్షణం ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో వైద్యులు, సహాయకుల (నర్సుల) రాత్రి, పగలు తేడా లేకుండా ఆసుపత్రుల్లోనే ఉండి వైరస్‌ బారినపడ్డ వారికి చికిత్స అందించారు. గత మూడునెలలుగా విజృంభిస్తోన్న కరోనా తీవ్రత ప్రస్తుతం చైనాలో కాస్త తగ్గుముఖం పట్టింది. ఇప్పటికి దాదాపు 70శాతం మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో కరోనాకు కేంద్రబిందువుగా భావిస్తున్న వుహాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో కొన్నింటిని మూసివేస్తున్నారు. ఈ సమయంలో అక్కడ పని చేసిన నర్సులు ఆనందంతో గంతులేస్తున్నారు. వుహాన్‌లో ఉన్న ఓ ఆసుపత్రి నుంచి చివరి పేషెంట్‌ డిశ్చార్జి అయి ఇంటికి వేళ్లే సమయంలో అక్కడి నర్సులు ఆనందంతో గంతేశారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది. దీంతో కరోనా వైరస్ ఎదుర్కోవడంలో మీ సేవలు ఎంతో అమూల్యమైనవి.. నిజమైన హీరోలు మీరేనంటూ అభినందనలు వెల్లువెత్తాయి. 

ఉష్ణోగ్రతలతో కరోనాకు సంబంధం లేదు!

దిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భారత్‌పైనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు సరైన మందులేని ఈ వైరస్‌ గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా దీనిపై దిల్లీకి చెందిన పలువురు నిపుణులు పలు సూచనలు చేశారు. ఈ వైరస్‌ వ్యాప్తికి, ఉప్ణోగ్రతలకు సంబంధంలేదని వారు తెలిపారు. ఈ వైరస్ ఒకరి వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మేలని సూచిస్తున్నారు. అంతేకాకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో దీని వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. 

సాధారణంగా గాలిలోని తేమ ఈ వైరస్‌ వ్యాప్తికి సహాయడుతుందని పరిశోధనలో తేలిందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా వైరస్‌ చనిపోతుందనే దానికి ఎటువంటి సంబంధంలేదు. వాతావరణంలో తేమ, వేడి ఉన్న సింగపూర్‌ వంటి దేశాలు కూడా కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని’’ గులేరియా అన్నారు. వాతావరణంలోని ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధం ఉందనే విషయం ఇంకా నిరూపితం కావాలని దిల్లీ ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్ నూతన్‌ ముండేజా తెలిపారు. మనుషుల ద్వారానే ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.

‘‘కరోనా పూర్తిగా కొత్త వైరస్‌. దాని గురించి శాస్త్రీయ సమాజానికి పూర్తి సమాచారం లేదు. ఇతర ఫ్లూ వైరస్‌లు జలుబు, పొడి వాతావరణంలో పెరిగి, పునరుత్పత్తి అవుతాయి. కానీ ఇవి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద పునరుత్పత్తి కావు. 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద ఫ్లూ వైరస్‌లు విస్తరించలేవు’’ అని మాక్స్‌ హెల్త్‌కేర్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సందీప్‌ బుధిరాజా తెలిపారు. ‘‘కరోనా వైరస్‌ అధిక ఉష్ణోగ్రతల్లో పునరుత్పత్తి కాదు. కానీ చల్లని ఉష్ణోగ్రతల్లో దీని జీవిత కాలం పెరుగుతుంది. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఇది వ్యాపించవచ్చు’’ అని దిల్లీలోని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్‌ కిషోర్‌ సింగ్ అన్నారు. 

విమాన యానంపై కరోనా ఎఫెక్ట్‌ 

ముంబయి: కరోనావైరస్‌ ఎఫెక్ట్‌ దేశీయ విమానయాన రంగంపైనా పడింది. తాజా బుకింగ్‌లు ఒక్కసారిగా 15శాతం పడిపోయాయి. కొవిడ్‌-19 వ్యాప్తి పెరగడంతో చాలా మంది ఇప్పటికే చేసుకొన్న బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో విమానయాన సంస్థల ఆదాయం కూడా తగ్గుముఖం పడుతోంది. చమురు ధరలు తగ్గడం ఒక్కటే విమానయాన సంస్థలకు కొంత ఉపశమనం ఇస్తోంది. 


ఇప్పటికే భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై చాలా దేశాలు తాత్కాలిక నిషేధం విధించాయి.  ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఈ పరిస్థితి ఉండటంతో చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకొంటున్నారు. ఇక దేశీయ ప్రయాణాల్లో దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు మార్గాల్లో ప్రయాణాలు తగ్గాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం తక్కువగా ఉంది. కానీ, ఇది పెరుగుతున్న భయాలతోపాటే పెరుగుతోంది. ఇటీవల కొన్నాళ్ల కిందట కరోనా భయం ఒక్కసారిగా పెరగటంతో అప్పట్లో చెన్నై-బెంగళూరు మార్గంలో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక దశలో వోల్వో బస్సుతో సమానంగా రూ.1,100కు టికెట్లు విక్రయించారు. 

కరోనా కోసం ‘కోవా పంజాబ్‌’
చండీగఢ్‌: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ పంజాబ్‌ ప్రభుత్వం ప్రజల సంరక్షణార్థం ఓ మొబైల్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ‘కోవా పంజాబ్‌’గా దీనికి నామకరణం చేశారు. పంజాబ్‌ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కరణ అవతార్‌ సింగ్‌ దీన్ని ఆవిష్కరించారు. ఈ యాప్‌లో కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వైరస్‌ లక్షణాలను వివరిస్తారు. అలాగే దగ్గర్లోని కరోనా పరీక్షలు చేసే ఆరోగ్యకేంద్రాల వివరాలు కూడా అందుబాటులో ఉంచారు. 

దేవుళ్ల విగ్రహాలకు ‘కరోనా’ మాస్క్‌లు
వారణాసి: వారణాసిలోని ప్రహ్లాదేశ్వర స్వామి ఆలయంలో అక్కడి పూజారులు కూడా మాస్కులు ధరించే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పూజారి విశ్వనాథుడి విగ్రహానికి, మందిరంలోని ఇతర విగ్రహాలకు కూడా మాస్కులు ధరించడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా విగ్రహాలను ముట్టుకోవద్దంటూ పూజారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
‘‘కరోనా వైరస్‌ దేశమంతటా వ్యాప్తిస్తోంది. ఈ విషయమై ప్రజల్లో అవగాహన తీసుకురావటానికి మేం విశ్వనాథుడి విగ్రహానికి కూడా మాస్కు వేశాం. ఇక్కడి విగ్రహాలకు శీతాకాలంలో వెచ్చని దుస్తులు, వేసవిలో ఫ్యాన్లు, ఏసీలు వేస్తాం. అలాగే కరోనా దేశమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడి విగ్రహాలకు కూడా మాస్కులు ధరించాం. కరోనా వైరస్‌ వ్యాప్తించకుండా ఉండటానికి విగ్రహాలను తాకొద్దని కూడా భక్తులకు సూచిస్తున్నాం’’ అని ఆలయ పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే తెలిపారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని