
‘కొంచెం ఆలస్యం కావచ్చు.. కానీ శిక్ష తప్పదు’
దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉరితీత నేపథ్యంలో శుక్రవారం ఉదయం తిహార్ జైలు వద్దకు భారీగా మహిళా హక్కుల కార్యకర్తలు చేరుకున్నారు. ఉరితీత ప్రక్రియ పూర్తియిందని జైలు అధికారులు నిర్ధారించిన వెంటనే మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు ఉరి అమలు చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖాశర్మ స్వాగతించారు. ‘తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనడానికి ఇదొక ఉదాహరణగా మిగిలిపోతుంది. ఉరి శిక్ష కాస్త తొందరగా అమలు చేస్తే బాగుండేది. తప్పు చేయాలనే ఆలోచన ఉన్న వారికి.. కఠిన శిక్షలు ఉంటాయని.. దీని ద్వారా అర్థం అవుతుంది. శిక్షలు కొంచెం ఆలస్యం కావచ్చు.. కానీ వేయడం అమలు మాత్రం తప్పనిసరి అనే విషయం తెలుస్తుంది’ అని రేఖా శర్మ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు దిల్లీ మహిళా కమిషన్ ఛైరపర్సన్ స్వాతి మలివాల్ కూడా ఉరితీతను స్వాగతించారు. ఇదో చరిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. ఏడు సంవత్సరాల తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందని అన్నారు. ఈరోజు తప్పకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. అత్యాచారం వంటి నేరాలకు పాల్పడాలనుకునే వారికి ఇది గట్టి సందేశం అని పేర్కొన్నారు.