అతడు చనిపోవడానికి పదకొండు రోజుల క్రితం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్‌ కట్టడికి ఎన్ని సూచనలు ఇచ్చినా కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. దగ్గుతున్నప్పుడు ముఖాన్ని కవర్‌ చేసుకోమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే కాదు.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా.....

Published : 06 Apr 2020 21:17 IST

డెట్రాయిట్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా వైరస్‌ కట్టడికి ఎన్ని సూచనలు ఇచ్చినా కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. దగ్గుతున్నప్పుడు ముఖాన్ని కవర్‌ చేసుకోమని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే కాదు.. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఓ వ్యక్తికి ఉండాల్సిన సాధారణ లక్షణం ఇది. కొవిడ్‌-19 వల్ల ఇప్పుడు తప్పక పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ మహిళ ఈ కనీస జాగ్రత్త పాటించకపోవడంతో అమెరికాలోని డెట్రాయిట్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోవడానికి పదకొండు రోజుల క్రితం ఓ మహిళ తన వద్ద దగ్గిందని ఆ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డెట్రాయిట్‌లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న జాసన్ హార్గోవ్‌ మార్చి 21న ఫేస్‌బుక్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. అమెరికాలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో తనకు ఎదురైన అనుభవాన్ని, ఆలోచనల్ని పంచుకున్నారు. తను విధుల్లో ఉన్నప్పుడు బస్సు ఎక్కిన ఓ మహిళ నోటికి ఏదీ అడ్డుపెట్టుకోకుండా దగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఈ సమయంలో ఎలా ఉండాలి?, ఎలా ఉండకూడదు? అని ఆరోగ్య సంస్థలు, నిపుణులు రోజూ వివరిస్తున్నారు. దగ్గుతున్నప్పుడు మోచేతిని అడ్డుపెట్టుకోమని చెబుతున్నారు. జలుబుగా ఉంటే టిష్యూ అడ్డుపెట్టుకోమని సూచించారు. దగ్గతున్నప్పుడు ఏదీ అడ్డుపెట్టుకోకపోవడంతో ఇక్కడ (అమెరికాలో) చాలా మంది చనిపోతున్నారు. ప్రజలు సూచనల్ని పాటించడం లేదు. ఇది నన్ను అసహనానికి గురి చేస్తోంది’ అని ఆయన వీడియోలో మాట్లాడాడు. ఇది జరిగిన పదకొండు రోజులకు జాసన్ కరోనా వైరస్‌ వల్ల మృతి చెందాడు. అతడి మరణంతో ‘ఈ వీడియోను అమెరికాలోని ప్రజలంతా చూడాలి’ అని డెట్రాయిట్‌ మేయర్‌ అన్నారు.

కరోనా వైరస్‌ ఉన్న వ్యక్తి ఒక్కసారి దగ్గితే నోటి నుంచి లక్షల కరోనా వైరస్‌లు గాలిలోకి వ్యాప్తి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌లు ఉపరితలాన్ని చేరుకోవడానికి ముందు కొన్ని గంటలపాటు గాలిలో ఉంటాయని తెలిపారు. ఉపరితలాన్ని చేతులతో తాకడం.. అదే చేతితో కళ్లు, ముక్కు, నోరును తడుముకోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ వైరస్‌ను ఎవరూ తాకకుండా ఉంటే గంటలు గడిచేకొద్దీ అదే చనిపోతుందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజలు తుమ్ముతున్నప్పుడు, దగ్గుతున్నప్పుడు చేతులు అడ్డు పెట్టుకోకపోతే, పరిస్థితులు దారుణంగా మారతాయని నిపుణులు హెచ్చరించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోమని సూచించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని