కిక్కు కోసం క్లిక్‌.. మద్యం విక్రయాలకో పోర్టల్‌!

దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు ఒడిశా ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. ఇప్పటికే మద్యం హోం డెలివరీని...........

Published : 03 Jun 2020 01:51 IST

ఏర్పాటు చేసిన ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్‌: దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు ఒడిశా ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. ఇప్పటికే మద్యం హోం డెలివరీని ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఓ పోర్టల్‌నే ప్రారంభించింది. అటు తాగేందుకు మందుబాబులు, అమ్మేందుకు ఇటు విక్రయదారులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు ఒడిశా స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఓఎస్‌బీసీ) అధికారులు.

మే 24న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్యం హోం డెలివరీని ప్రారంభించింది. మందుబాబులు ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన నంబర్లకు ఫోన్‌ చేస్తేనే హోం డెలివరీ జరిగేది. ఇందుకోసం జోమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే, తమ ఫోన్ నంబర్లు మందుబాబులకు చేరేందుకు రిటైలర్లు విస్తృతంగా ప్రచారం చేసేవారు.

ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఆదివారం వరకు సుమారు దాదాపు రెండున్నర లక్షల ఆర్డర్లు వచ్చాయి. దీంతో హోం డెలివరీకి పెరుగుతున్న డిమాండ్‌ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం https://osbc.co.in/ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. మొదటి సారి ఈ పోర్టల్‌ను వినియోగించే వినియోగదారులు లాగిన్‌ చేసుకోవాలట. ప్రభుత్వ వెబ్‌సైట్‌ కదా.. పొరపాటున మొబైల్‌కు సపోర్ట్‌ చేస్తుందో లేదో అన్న అనుమానం కూడా అక్కర్లేదని చెబుతున్నారు అధికారులు. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ పోర్టల్‌ను అవసరమైతే హోం స్క్రీన్‌లో పెట్టుకోవచ్చని అంటున్నారు.

ఈ పోర్టల్‌లో ఆ జిల్లాలో ఉన్న రిటైలర్ల వివరాలు, బ్రాండ్లు, ఎంఆర్‌పీ తదితర వివరాలు ఉంటాయి. పొరపాటున నంబర్‌ను తప్పుగా ఎంటర్‌ చేస్తారని కాబోలు.. ఆ ప్రయాస లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేయొచ్చని చెబుతున్నారు అధికారులు. అలా ఆర్డర్‌ చేయగానే ఎంఆర్పీతో పాటు, డెలివరీ ఛార్జీలతో కూడిన బిల్లు కూడా ఆన్‌లైన్‌లోనే పంపిస్తారట. త్వరలో యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ వంటి ఫీచర్లను కూడా తీసుకొస్తారట. మరిన్ని ఆధునిక ఫీచర్లతో యాప్‌ను కూడా తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని