ఈ భారతీయుడే ఇప్పుడు అమెరికా హీరో!

70 మందికి పైగా అమెరికన్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన భారతీయ సంతతి వ్యాపారవేత్తను... హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Published : 04 Jun 2020 17:11 IST

వారిని లోపలికి లాగేసి తలుపులు మూయటం మా పనయింది

వాషింగ్టన్‌: ముక్కూ ముఖం తెలియకపోయినా 70 మందికి పైగా అమెరికన్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన భారతీయ సంతతి వ్యాపారవేత్తను... హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పోలీసుల చేతిలో మరణించిన ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా వేల మంది అమెరికా వీధుల్లో ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్‌ స్ప్రేలు వంటి వాటిని ప్రయోగించారు. అనంతరం ఆయా ప్రదేశాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట తరిమిన తమకు రాహుల్‌ దూబె ఆశ్రయం కల్పించారంటూ నిరసన కారుల్లో ఒకరు ట్వీట్‌ చేయటంతో ఈయన గురించి ప్రపంచానికి తెలిసింది. ఆల్వారెజ్‌ ట్రేడింగ్‌ కంపెనీ అనే సంస్థకు యజమాని అయిన రాహుల్‌ దూబె, వాషింగ్టన్‌ డీసీలో 17 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నవారికి ఆశ్రయమివ్వటంతో పాటు భోజనం తదితర సౌకర్యాలు కల్పించిన ఆయన అగ్రరాజ్యంలోని వార్తా పత్రికల్లో పతాక శీర్షికలో నిలిచారు. ఆనాటి సంఘటనను 44 సంవత్సరాల రాహుల్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా వివరించారు...

‘‘పగలంతా ప్రదర్శనల్లో పాల్గొన్న వారికి, కర్ఫ్యూ ప్రారంభం కావటంతో రాత్రి తలదాచుకునేందుకు చోటు దొరకలేదు. సోమవారం రాత్రి ఇంటి బయట కూర్చున్న నాకు నిరసనకారులను తరుముతూ పోలీసులు రావటం కనిపించింది. వారిలో కొంతమంది మా వరండాలో కూర్చుని తమ ఫోన్‌ను ఛార్జి పెట్టుకోవచ్చా అని... బాత్‌రూంను వాడుకుంటామని అడగటంతో మొదలైంది. అనంతరం నిరసనకారులు ప్రవాహంలా రావటం మొదలు పెట్టారు. రాత్రంతా మేలుకొని వారు వచ్చినప్పుడు లోపలికి లాగేసి తలుపులు మూయటం మా పనయింది. వచ్చింది ఎవరైనా, ఎలాంటి వారైనా ఆశ్రయం ఇవ్వక తప్పని పరిస్థితి అని నాకు తెలుసు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రమే జనం రావటం ఆగింది. ఆ రోజు ఇంటికి 75 మందికి పైగా వచ్చారు. కొందరు సోఫాల్లో ఉండగా... కొంతమందైతే బాత్‌టబ్‌లో కూడా ఉన్నారు. వచ్చిన వారిలో ఓ మహిళ, ఆమె చిన్నారి ఉన్నారు. వారికి సౌకర్యంగా ఉండేందుకు నా కొడుకు గదిని కేటాయించాను. కానీ వారిలో ఎవ్వరూ తమ హద్దు మీరలేదు. ఆ రాత్రంతా వారు ఆనందంగా ఉన్నారు... క్షేమంగా ఉన్నారు... ఉల్లాసంగా ఉన్నారు... ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు కర్ఫ్యూ సడలించిన అనంతరం వారందరూ వెళ్లిపోయారు.’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని