హమ్మయ్య.. ‘రాకాసి ఓడ‌‌’ కదిలింది!

సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌక ముందుకు కదిలేందుకు మార్గం సుగమమైంది. కాలువలో నౌక ఇరుక్కున్న ప్రదేశం నుంచి భారీగా ఇసుకను

Updated : 29 Mar 2021 22:27 IST

కైరో: ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకుపోయిన భారీ కంటైనర్‌ నౌక ‘ఎవర్‌ గివెన్‌’ ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంతో   ఈ రాకాసి ఓడ ప్రయాణం మొదలైంది. దీంతో ఇప్పటికే భారీగా జామ్‌ అయిన ఇతర నౌకలకు మార్గం సుగమమైనట్లు సూయిజ్‌ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. దాదాపు 20వేల కంటైనర్లతో వెళ్తున్న ఎవర్‌ గివెన్‌ నౌక..  గత మంగళవారం సూయిజ్‌ కాలువలో అడ్డంగా తిరిగి చిక్కుకున్న విషయం తెలిసిందే. 

ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లతో తవ్వుతూ.. మరోవైపు టగ్‌బోట్ల సహాయంతో నౌకను కదిలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించారు. అలా ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్‌ చేశారు. వీటికి తోడు వాతావరణం కూడా సహకరించడంతో ఈ భారీ నౌక ప్రయాణానికి మార్గం సుగమమైనట్టు నిపుణులు వెల్లడించారు.

ఆసియా, యూరప్‌ల మధ్య సరుకులు రవాణా చేసే ఈ భారీ నౌక ‘ఎవర్‌ గివన్‌’ సూయిజ్‌ కాలువలో చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. నౌకలో ఒక భాగం భూమిలోకూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు దాదాపు వారం రోజులుగా అంతర్జాతీయ నిపుణుల బృందం తీవ్ర కృషి చేసింది.

భారీ నౌక అంతరాయం వల్ల ప్రభావం..

* 400 మీటర్ల పొడవున్న ‘ఎవర్‌ గివన్‌’లో 20 వేల కంటైనర్లతో బయలుదేరింది.

* నౌక బరువు 2లక్షల 20వేల టన్నులు

* నౌక నిలిచిపోవడంతో రోజుకు రూ.65,205 కోట్ల (9 బిలియన్‌ డాలర్లు) వ్యాపారం స్తంభించింది.

* భారీ నౌక చిక్కుకుపోవడంతో సూయిజ్‌ కాలువ మీదుగా వెళ్తున్న దాదాపు 369 నౌకలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి.

* వీటిలో గొర్రెలు, ఆయిల్‌ ట్యాంకర్లు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ ట్యాంకులూ ఉన్నాయి.

* సూయిజ్‌ కెనాల్‌ మార్గం నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకొనేది కూడా భారత్‌ దేశమే.

* ఈ మార్గంలో భారత్‌కు నిత్యం 5,00,000 పీపాలు, చైనాకు 4,00,000 పీపాల చమురు దిగుమతి అవుతోంది.

* దీంతో చమురు ధరలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా.

* భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సరుకుల్లోనూ జాప్యం కానుంది.

* ప్రస్తుతం సూయిజ్‌ కాలువలో ఏర్పడ్డ ఈ ట్రాఫిక్‌ క్లీయర్‌ అయ్యేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని