Virus Mutations: మానవ శరీరంలోనే వైరస్‌ మార్పులు 

బాధితుడి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్‌ జన్యుక్రమంలో జరిగే మార్పులు..

Published : 01 Aug 2021 11:34 IST

కొత్త వేరియంట్లకు బీజాలు 

దిల్లీ: బాధితుడి శరీరంలోకి ప్రవేశించాక కరోనా వైరస్‌ జన్యుక్రమంలో జరిగే మార్పులు.. కొత్త వేరియంట్లలోనూ ప్రతిబింబిస్తున్నాయని భారత శాస్త్రవేత్తలు తేల్చారు. ఉద్ధృతంగా వ్యాపించే కరోనా వైరస్‌ రకాల వ్యాప్తి, సాంక్రమిక శక్తిపై ముందస్తు అంచనాలు వేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అలాగే బాధితుడి శరీరంలో ఉన్నప్పుడు వైరస్‌లో జరిగే మార్పులను పరిశీలించడం ద్వారా.. దాని మనుగడకు కీలకంగా మారే/ అవరోధంగా తయారయ్యే భాగాలను గుర్తించడానికి వీలవుతుందన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఉత్పరివర్తన అనేది వైరస్‌ జీవనచక్రంలో చాలా సాధారణ ప్రక్రియ. మానవ కణంలోపల వైరస్‌ తన ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. ఈ క్రమంలో కొత్త వైరస్‌ ప్రతిరూపాల్లోని న్యూక్లియోటైడ్లలో స్వల్ప మార్పులు తలెత్తుతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అదే వ్యక్తిలో ఈ వైరస్‌ ప్రతిరూపాలు ఇతర కణాల్లోకి విస్తరించేకొద్దీ.. ఆ మార్పులు కూడా క్రమంగా సూక్ష్మజీవిలో పేరుకుపోయే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి, సమీపంలోని ఇతరులకూ వ్యాపిస్తున్నాయని తెలిపారు. మహమ్మారి సమయంలో రెండు విభిన్న సందర్భాల్లో దాదాపు మూడువేల మంది కొవిడ్‌-19 బాధితుల నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని