Corona: మళ్లీ వణికిస్తున్న మహమ్మారి..  రష్యా, జర్మనీ, చైనాలో కేసులు పైపైకి..

బెర్లిన్, మాస్కో, టోక్యో: పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ ఎగబాకుతున్నాయి. టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండటంతో, 

Updated : 09 Nov 2021 11:41 IST

బెర్లిన్, మాస్కో, టోక్యో: పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ ఎగబాకుతున్నాయి. టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండటంతో, చాలాచోట్ల మహమ్మారి విజృంభిస్తోంది. జర్మనీలో మునుపెన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏడు రోజులుగా ప్రతి లక్షమందిలో సుమారు 201 మంది వైరస్‌ బారిన పడుతున్నట్టు అధికారులు సోమవారం వెల్లడించారు. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 15,513 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. అంతకుముందు రోజు 37,120 కేసులు నమోదయ్యాయి. టీకా కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం వల్లే వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. తాజా ఉద్ధృతిని ‘టీకా తీసుకోనివారి మహమ్మారి’గా పిలుస్తున్నారు.

రష్యాలో నిత్యం 1,100కు పైగా మరణాలు

రష్యాలో కొవిడ్‌ కేసులు, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 39,400 పాజిటివ్‌ కేసులు, 1,190 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తున్నా, తొమ్మిది రోజుల విరామం అనంతరం ఉద్యోగులు సోమవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. అక్టోబరు చివరివారం నుంచి రష్యాలో ప్రతి రోజూ కనీసం 1,100 మంది కరోనా బాధితులు మృతిచెందుతున్నారు.

జపాన్‌లో 15 నెలల్లో మొదటిసారిగా...

జపాన్‌లో మహమ్మారి నెమ్మదిస్తోంది! దేశంలో సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. 15 నెలల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. కాగా- విదేశీ విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులపై గతంలో విధించిన ఆంక్షలను జపాన్‌ ప్రభుత్వం సోమవారం సడలించింది. స్వీయ నిర్బంధ వ్యవధిని 10 రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించింది. జపాన్‌లో నెమ్మదిగా ఆరంభమైన టీకా కార్యక్రమం జూన్‌ నుంచి వేగం అందుకొంది. సుమారు 74% మందికి ఇప్పటికే పూర్తిస్థాయిలో టీకాలు అందజేశారు.

స్లొవేకియాలో ఆంక్షలు కఠినతరం 

స్లొవేకియాలో సుమారు సగం మంది జనాభా కరోనా బారిన పడ్డారు! దీంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. హోటళ్లను, రెస్టారెంట్లను మూసివేయించింది. మరోవైపు, అర్హులంతా టీకా తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి వ్లాదిమిర్‌ లాంగ్వాస్కీ ప్రజలకు పిలుపునిచ్చారు.

చైనాలో ‘వుహాన్‌’ స్థాయిని మించి..

చైనాలో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకొంది. మూడింట రెండొంతుల రాష్ట్రాల్లో వందల మంది కరోనాబారిన పడినట్టు అధికారులు తెలిపారు. వుహాన్‌లో మహమ్మారి తొలిసారి వెలుగు చూసినప్పటి కంటే ఇప్పుడే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొవిడ్‌ ఆంక్షలను చైనా సర్కారు కఠినంగా అమలుచేస్తోంది. పనిలేకుండా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచించింది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని