
Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన వరుణ్ సింగ్
బెంగళూరు: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన.. ఈ ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని భారత వాయుసేన ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
ఈ నెల 8వ తేదీన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కున్నూరు ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రావత్ దంపతులు సహా 13 మంది మృతిచెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను వెంటనే వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని కమాండో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.
భారత వాయుసేనలో వరుణ్ విశేష సేవలందించారు. గతేడాది తాను నడుపుతున్న తేజస్ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ.. ఎంతో నైపుణ్యం, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇందుకు గానూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయనను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
వరుణ్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సానుభూతి ప్రకటించారు.
* ‘‘గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి బాధాకరం. భారత వాయుసేనలో ఆయన ఎంతో శౌర్యపరాక్రమాలు, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ దేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’ - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
* ‘‘గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ శౌర్య పరాక్రమాలతో దేశానికి సేవ చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర వేదనకు లోనయ్యా. దేశానికి ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువలేనిది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా’’ - ప్రధాని మోదీ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.