భారత్‌ భూభాగంలోకి చైనా!

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా...? గతంలో మన దళాలు గస్తీ నిర్వహించిన ప్రాంతాలను డ్రాగన్‌కు కోల్పోయామా..? ఇవన్నీ ఇప్పుడు ఆ దేశ ఆక్రమణలో ఉన్నాయా...? అవుననే అంటోంది గతవారం జరిగిన డీజీపీల సదస్సులో సమర్పించిన ఓ నివేదిక. ఇందులో పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 26 Jan 2023 07:32 IST

26 గస్తీ పాయింట్లను కోల్పోయిన సైన్యం
2020 ఏప్రిల్‌కు ముందు ఇవన్నీ మనవే
డీజీపీల సదస్సులో వెల్లడైన కీలక అంశాలు

దిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా...? గతంలో మన దళాలు గస్తీ నిర్వహించిన ప్రాంతాలను డ్రాగన్‌కు కోల్పోయామా..? ఇవన్నీ ఇప్పుడు ఆ దేశ ఆక్రమణలో ఉన్నాయా...? అవుననే అంటోంది గతవారం జరిగిన డీజీపీల సదస్సులో సమర్పించిన ఓ నివేదిక. ఇందులో పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లద్దాఖ్‌లో కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉండగా.. ఇందులో భారత్‌ 26 పాయింట్లలో గస్తీ నిర్వహించడం లేదని ఈ పత్రం పేర్కొంది. ఈ  భూభాగాలను చైనా తనలో కలిపేసుకుందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం అక్కడ (తూర్పు లద్దాఖ్‌) కారాకోరం పాస్‌ నుంచి చుమూర్‌ వరకు మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత్‌ సాయుధ బలగాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. కానీ, మొత్తం 65 పెట్రోలింగ్‌ పాయింట్లలో 26 చోట్ల (5-17, 24-32, 37)కు మన బలగాలు వెళ్లలేకపోతున్నాయి’’ అని లెహ్‌ ఎస్పీ పి.డి. నిత్య తన నివేదికను డీజీపీల సదస్సులో సమర్పించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ సదస్పులో పాల్గొన్నారు.

డ్రాగన్‌ ‘సలామీ స్లైసింగ్‌’

ఈ ప్రాంతాల్లో భారత్‌ గస్తీ నిర్వహణ లేకపోవడాన్ని చైనా సాకుగా చూపి.. ఆ భూభాగాలను కలిపేసుకుంటోందని నివేదికలో హెచ్చరించారు. 2020 ఏప్రిల్‌-మే నెలలకు ముందు ఇవన్నీ మన ప్రాంతాలే. ఇక్కడ మన పెట్రోలింగ్‌ దళాలు గస్తీ నిర్వహించాయి. అయితే చైనా తన ‘సలామీ    స్లైసింగ్‌’ వ్యూహంలో భాగంగా ఒకొక్క అంగుళం భూమిని నెమ్మదిగా ఆక్రమించుకుంటోందని నివేదిక వెల్లడించింది. ‘‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చేపట్టిన చర్చల్లో ఏర్పాటు చేసే బఫర్‌ జోన్లను అవకాశంగా మలుచుకొంటోంది. ఇక్కడ ఎత్తైన శిఖరాలపై కెమెరాలను అమర్చి.. భారత్‌ దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్‌ జోన్‌లోకి మన సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగంగా వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్‌ జోన్‌ ఏర్పాటు పేరిట భారత్‌ను వెనక్కి నెడుతోంది’’ అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో విశ్లేషించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు యత్నిస్తోందని భారత్‌ ఆరోపించిన నెలరోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు