కొనసాగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనలు, నిరసనలు

బీబీసీ విడుదల చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ విశ్వవిద్యాలయాల్లో అలజడులు సృష్టిస్తూనే ఉంది.

Published : 30 Jan 2023 04:50 IST

రాజస్థాన్‌ వర్సిటీలో 10 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

దిల్లీ: బీబీసీ విడుదల చేసిన వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ విశ్వవిద్యాలయాల్లో అలజడులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ (సీయూఆర్‌ఏజీ), టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లలో డాక్యుమెంటరీ ప్రదర్శనలు, వాటికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పది మంది విద్యార్థులను రెండు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సీయూఆర్‌ఏజీ అధికారులు తాజాగా ప్రకటించారు. జనవరి 26న డాక్యుమెంటరీ ప్రదర్శించినందుకే ఈ చర్య తీసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నప్పటికీ విశ్వవిద్యాలయ వర్గాలు ఆ వాదనను ఖండించాయి. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి వేళ ఉండకూడని ప్రదేశాల్లో గుమిగూడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి. ముంబయి టిస్‌ క్యాంపస్‌లో శనివారం కొంత మంది విద్యార్థులు డాక్యుమెంటరీని ప్రదర్శించుకుని చూశారని పోలీసు అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. పోలీసుల పహారా, భాజపా ఆందోళనల మధ్య 200 మంది విద్యార్థులు డాక్యుమెంటరీని వీక్షించారని ‘ప్రగతిశీల విద్యార్థి వేదిక-టిస్‌’ ఓ ప్రకటన జారీ చేసింది. బీబీసీ చర్యలను వ్యతిరేకిస్తూ, దానిని భారత్‌లో నిషేధించాలని రాసి ఉన్న ప్లకార్డులను దిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని హిందూసేన సభ్యులు అక్కడ పెట్టినట్లు భావిస్తున్నారు. ఇందిరాగాంధీ తరహాలో ప్రస్తుత ప్రభుత్వమూ బీబీసీని నిషేధించాలని హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్త డిమాండు చేశారు. మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు