అదానీపై అదే రగడ..
అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మోదీ అండతోనే ఆయన ఎదిగారు
గౌతమ్ కోసం నిబంధనలే మార్చేశారు
విమానాశ్రయాలు, పోర్టులు కట్టబెట్టేశారు
లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్
ప్రధానితో అదానీ కలసి ఉన్న ఫొటో ప్రదర్శన
అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్
దిల్లీ: అదానీ గ్రూప్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే గౌతమ్ అదానీ అనతికాలంలో ప్రపంచ కుబేరుడిగా అవతరించారంటూ విమర్శించారు. అదానీ కోసం ఏకంగా నిబంధనలనే మార్చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ గాంధీ మంగళవారం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమ్ అదానీ వ్యవహారంపై పలు ఆరోపణలు చేశారు.
రాహుల్ ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు
* విమానాశ్రయాల నిర్వహణలో పూర్వ అనుభవం లేనివారికి వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ, వాటిని కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. ఏకంగా దేశంలోని ఆరు ఎయిర్‌పోర్టుల(30 శాతం వ్యాపార వాటా)ను అదానీకి కట్టబెట్టింది. అత్యంత లాభదాయకమైన విమానాశ్రయాల్లో ఒకటైన ముంబయి ఎయిర్‌పోర్టును అప్పగించింది. ఇందుకోసం జీవీకే గ్రూప్‌పై సీబీఐ, ఈడీలను ప్రయోగించింది.
* 2014లో 8 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 నాటికి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగింది? నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యాక ఇంద్రజాలం మొదలైంది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల్లో 2014లో 609వ స్థానంలో ఉన్న అదానీ ఇటీవల రెండో స్థానానికి ఎగబాకారు.
* ప్రధాని మోదీ ఆస్ట్రేలియాకు వెళ్తే అదానీ గ్రూప్‌నకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది.
* ప్రధాని బంగ్లాదేశ్ వెళితే అక్కడి పవర్ డెవలప్‌మెంట్ బోర్డు అదానీకి 25 ఏళ్ల కాంట్రాక్టు అప్పగించింది. ఇదేం మాయ?
* భారత్-ఇజ్రాయెల్ రక్షణ సహకారం ఒప్పదం 90 శాతం అదానీ చెప్పుచేతల్లో ఉంది.
* ప్రధాని మోదీ ఒత్తిడితోనే తమ దేశంలో నిర్మితమవుతున్న పవర్ ప్రాజెక్ట్‌ను అదానీకి అప్పగించామని శ్రీలంక వెల్లడించింది.
* ఇటీవల విడుదలైన హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీకి భారత్ వెలుపల షెల్ కంపెనీలు ఉన్నాయని ఉంది. అవి వేలాది కోట్ల రూపాయలను భారత్‌లోకి పంపుతున్నాయి. ఇవి ఎవరి డబ్బులు?
* భారత్‌లోని పోర్టుల్లో, విమానాశ్రయాల్లో అదానీ ఆధిపత్యం చెలాయిస్తారు. భారత రక్షణ రంగంలోనూ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తికి షెల్ కంపెనీలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదు. వాటి గురించి మీకు ఏమీ తెలియదు.
* ప్రధాని మోదీ ఇప్పటి వరకు అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? విదేశాల్ల్లో ఎన్నిసార్లు అదానీని కలిశారు? భాజపాకు గడిచిన 20 ఏళ్లలో అదానీ ఎంతిచ్చారు?
నిరుద్యోగం ప్రస్తావనేది?
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ చెప్పారు. పాదయాత్రలో ఎంతోమంది ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారని తెలిపారు. ప్రస్తుతం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలే ప్రధానంగా ఉన్నాయని.. కానీ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి మాట్లాడలేదని విమర్శించారు. అగ్నిపథ్ స్కీమ్‌నూ ఈ సందర్భంగా రాహుల్ తప్పుబట్టారు. ఆర్మీని ఈ పథకం బలహీన పరుస్తుందని సీనియర్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.
అధికార పక్షం అభ్యంతరాలు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగం సమయంలో అధికార పక్షం నుంచి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాహుల్‌కు సూచించారు. ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తన ప్రసంగం మధ్యలో అదానీతో మోదీ సంబంధాలకు సంబంధించి వారు ఇద్దరూ కలిసి ఉన్న చిత్రాలను లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రదర్శించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలన్నారు. మరోపక్క విపక్షానికి చెందిన పలువురు నేతలు రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శిస్తూ అదంతా అర్ధసత్యాలతోనే ఉందని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి ముఖ్యమైన అంశాలను ప్రస్తావించలేదని ఆరోపించారు.
* రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రను ఉద్దేశించి దేశాన్ని ఏకం చేయడానికంటే ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ముఠాలను ఐక్యంగా ఉంచడంపై దృష్టిసారించాలని భాజపా ఎంపీ సి.పి.జోషి విమర్శించారు.
సభా కార్యక్రమాలకు సరేనన్న ప్రతిపక్షాలు
పార్లమెంటు సభా కార్యక్రమాల్లో బుధవారం నుంచి పాల్గొనాలని అధికశాతం ప్రతిపక్షాలు మంగళవారం నిర్ణయించాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో 15 ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయించారన్నారు. అయితే అదానీ సమస్యపై చర్చ చేపట్టకపోతే తాము పాల్గొనేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), భారత్ రాష్ట్ర సమితి (భారాస) స్పష్టం చేశాయన్నారు.
* అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు కేంద్రం అంగీకారం తెలపనందున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను తాము బహిష్కరిస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రకటించింది.
* అదానీ సంస్థపై హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక చేసిన ఆరోపణలపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అమృత్‌కాల్ ప్రయోజనాలు కొందరికి మాత్రమే దక్కాయన్నారు. 21 మంది వద్ద ఉన్న ఆస్తుల విలువ 70 కోట్ల మంది ప్రజల ఆస్తితో సమానంగా ఉందన్నారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీయే ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కృషి చేస్తోందని రాజ్యసభలో భాజపా సభ్యులు పేర్కొన్నారు.
* ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.
* నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఆరోపణలను భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైనవని, అభ్యంతరకరమైనవని, నిర్లక్ష్యంగా చేసినవని పేర్కొన్నారు. దేశ ప్రతిష్ఠను మసకబార్చిన భారీ కుంభకోణాల్లో కాంగ్రెస్, గాంధీ కుటుంబాలకు పాత్ర ఉందని పార్లమెంటు వెలుపల విలేకరుల వద్ద ఆక్షేపించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
Education News
MBBS results: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Movies News
Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం