దర్యాప్తు సంస్థల దుర్వినియోగం

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం... దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని ఆరోపిస్తూ భారాస సహా 14 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Published : 25 Mar 2023 04:07 IST

రాజకీయ ప్రత్యర్థులపైకి సీబీఐ, ఈడీలను కేంద్రం ఉసిగొల్పుతోంది
95% కేసులు విపక్ష నేతలపైనే
సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన భారాస సహా 14 పార్టీలు
ఏప్రిల్‌ 5న విచారణ జరుపుతామన్న సీజేఐ ధర్మాసనం

ఈనాడు, దిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం... దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని ఆరోపిస్తూ భారాస సహా 14 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రాజకీయ కారణాలతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అరెస్ట్‌ చేయకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాయి. అత్యవసర ప్రాతిపదికన ఈ కేసును విచారించాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశాయి. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ఈ కేసు విషయాన్ని శుక్రవారం సీజేఐ దృష్టికి తీసుకెళ్లగా ఏప్రిల్‌ 5న విచారణ చేపట్టడానికి ఆయన అంగీకరించారు. ధర్మాసనంలో జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహా, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా సభ్యులుగా ఉన్నారు. పిటిషనర్లలో భారాస, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, ఆప్‌, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), జేఎంఎం, జేడీయూ, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉన్నాయి.

పిటిషన్‌లో ఏముందంటే..

కేంద్రం విధానాలను వ్యతిరేకించే  పార్టీలు, రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ మాట్లాడే వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అరెస్ట్‌లకు పాల్పడుతోంది. కేంద్రం ఆదేశాలతో సీబీఐ, ఈడీలు కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి.

* ఈడీ నమోదు చేసిన కేసులు 2013-14లో 209 ఉండగా, 2020-21నాటికి అవి 981కి, 2021-22 నాటికి 1,180కి పెరిగాయి.

* 2004-14 మధ్య కాలంలో సీబీఐ 72 మంది రాజకీయ నాయకులను విచారించగా అందులో 43 మంది (60%లోపు) ప్రత్యర్థి పార్టీల వారు. కానీ ఇప్పుడు 95% మంది ప్రతిపక్ష నాయకులే ఉన్నారు.

* 2014కి ఈడీ దర్యాప్తు చేసిన కేసుల్లో 54% మాత్రమే ప్రతిపక్ష పార్టీల వారు ఉండగా, 2014 తర్వాత అది 95%కి చేరింది.

* ఈ పరిస్థితుల్లో అధికరణం 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు గుర్తింపునిస్తూ దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలి.

* తీవ్రమైన హింసాత్మక నేరాల్లో తప్పితే మిగిలిన నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్ట్‌ చేసేటప్పుడు ట్రిపుల్‌ టెస్ట్‌ (పారిపోవడం, సాక్ష్యాల తారుమారు, సాక్షులను ప్రభావితం చేయడం)అంశాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలి. ఒకవేళ ఆ అంశాలు సంతృప్తిగా లేవనిపిస్తే నిర్దిష్ట గంటల్లో దర్యాప్తు జరిపేలా కానీ, లేదంటే గృహ నిర్బంధం వరకు పరిమితమయ్యేలా ఆదేశించాలి.

* అరుదైన సమయాల్లోనే జైలుకి పంపాలి. మిగిలిన సమయాల్లో బెయిల్‌ నిబంధన అనుసరించాలన్న సూత్రాన్ని అన్ని కోర్టులూ పాటించేలా చూడాలి. ట్రిపుల్‌ టెస్ట్‌ విఫలమైన కేసుల్లోనే బెయిల్‌ తిరస్కరించాలి.

* మనీలాండరింగ్‌ లాంటి చట్టాల్లో బెయిల్‌ నిబంధనలు కఠినంగా ఉన్నట్లు అనిపిస్తే అధికరణం 21కి లోబడి ఉత్తర్వులు జారీ చేయాలి. ఆరు నెలల్లోపు విచారణ పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోతే నిందితులకు బెయిల్‌ ఇవ్వాలి.

* ప్రస్తుతం కోర్టును ఆశ్రయించిన పార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో 45.19%, పార్లమెంటు ఎన్నికల్లో 42.5% ఓట్లు వచ్చాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి.

* దర్యాప్తు సంస్థలు దాడుల అనంతరం తీసుకున్న చర్యల రేటు 2005-14 మధ్యకాలంలో 93% ఉండగా, 2014-22 మధ్యకాలంలో అది 29%కి పడిపోయింది. పీఎంఎల్‌ఏ చట్టం కింద కేవలం 29 శిక్షలు మాత్రమే పడ్డాయి.


దిల్లీలో ప్రతిపక్ష ఎంపీల నిరసన ర్యాలీ

దిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తూ పలువురు విపక్ష ఎంపీలు శుక్రవారం దిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని పరువు నష్టం కేసులో దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించడంతోపాటు, అదానీ వ్యవహారంలో జేపీసీ విచారణ డిమాండుతో వారు ఈ ఆందోళన చేపట్టారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ప్రదర్శన విజయ్‌ చౌక్‌ వరకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. నిషేధ ఉత్తర్వులు(సెక్షన్‌ 144)ను ఉల్లంఘించిన 40 మందికిపైగా ఎంపీలను నిర్బంధంలోకి తీసుకుని తరువాత విడుదల చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎంపీల్లో కె.సి.వేణుగోపాల్‌, అధీర్‌ రంజన్‌ చౌధురీ, కె.సురేశ్‌ తదితరులున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం), శివసేన(యూబీటీ), జేడీ(యు), ఆప్‌ సభ్యులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని