పేదలకు గ్యాస్‌ ‘బండే’!

దేశంలో పేదలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరే గుదిబండగా మారిందని తేలింది. దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టత, డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం వంటివీ వారు వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడైంది.

Updated : 22 Aug 2023 10:46 IST

దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టం
డెలివరీలోనూ లోపాలు
అందుకే వారు దూరం
‘క్యాభ్‌’ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: దేశంలో పేదలకు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరే గుదిబండగా మారిందని తేలింది. దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టత, డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడం వంటివీ వారు వంట గ్యాస్‌ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడైంది. పేదలు వంట గ్యాస్‌ వాడకపోవడానికి గల కారణాలపై స్వచ్ఛ గాలి, మెరుగైన ఆరోగ్యం (క్యాభ్‌) ప్రాజెక్టు జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) పాలుపంచుకుంది. క్యాభ్‌ అధ్యయనంలోని వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఈ ఏడాది మార్చి నాటికి 9.59 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లను జారీ చేసినా వారిలో ఎంత మంది వాడుతున్నారో తెలియడం లేదు. సిలిండర్లను రీఫిల్‌ చేసుకోవడమే వారికి పెద్ద భారంగా మారింది. వారి ఆదాయాల్లో హెచ్చుతగ్గులు ఇబ్బందికరంగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇప్పటికీ 41శాతం మంది పేదలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. వారికి ఎల్‌పీజీవల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన లేదు. ఝార్ఖండ్‌లో 67.8శాతం మంది పేదలు కట్టెలనే వాడుతున్నారు. దిల్లీలో అతి తక్కువగా 0.8శాతం మందే కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. సులభంగా అందుబాటులో ఉన్న వాటినే వంటకు పేదలు వినియోగిస్తున్నారు. దీంతోపాటు ఆర్థిక సమస్యలవల్లా ఎల్‌పీజీ వాడలేకపోతున్నారు. అసలు చాలా మందికి ఎల్‌పీజీవల్ల వాయు కాలుష్యం తగ్గుతుందనే విషయమే తెలియదు. పట్టణ ప్రాంతాల్లోని పేదల్లో ఒకేసారి సిలిండర్‌కు అంత మొత్తం చెల్లించడం ఇబ్బందికరంగా మారింది. దరఖాస్తు ప్రక్రియలోని సంక్లిష్టత పేదలకు మరింత కష్టంగా ఉంది. క్షేత్ర స్థాయిలో పంపిణీ వ్యవస్థ సరిగా లేకపోవడమూ మరో కారణంగా తేలింది.


విస్తృత అవగాహన కల్పించాలి

కట్టెల పొయ్యిలను వాడటంవల్ల కలిగే దుష్ప్రభావాలపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, ఎల్‌పీజీవల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని క్యాభ్‌ సూచించింది. ఈ ప్రచారాన్ని స్వయం సహాయక సంఘాలు, సామాజిక మాధ్యమాల ద్వారా చేయాలని పేర్కొంది. సిలిండర్లను ఇంటికి తెచ్చి అందిస్తామని భరోసా కల్పించాలని సూచించింది. బస్తీల్లో నివశించే పేదలకు దరఖాస్తు చేయడంలో సహకరించాలని పేర్కొంది. ఇందుకోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని బస్తీలో నెలకొల్పాలని సూచించింది. 5 కేజీల సిలిండర్లపైనా అవగాహన కల్పించాలని, ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లింపుల విధానాన్ని తేవాలని క్యాభ్‌ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని