ఆ ఘనత దేశ మహిళలదే

మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం ఘనత దేశంలోని మహిళలందరికీ దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 24 Sep 2023 05:42 IST

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై  ప్రధాని మోదీ వ్యాఖ్య
వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి శంకుస్థాపన

వారణాసి: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం ఘనత దేశంలోని మహిళలందరికీ దక్కుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌లో వందన్‌ (మహిళలను పూజించడం) పేరు పెట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ఆరోపించారు. తన నియోజకవర్గం వారణాసిలో శనివారం కేవలం మహిళలే హాజరైన సదస్సులో ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సభలో పాల్గొన్న మహిళలంతా ప్రధానిపై పూలను చల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా నాయకత్వం అనేది ప్రపంచానికి ఇప్పుడు కొత్తగానీ మన దేశంలో పురాణాల నుంచీ ఉందని తెలిపారు. మహాదేవుడి కంటే ముందే మనం తల్లి పార్వతిని, గంగను పూజించామని చెప్పారు. పూజించడం, గౌరవించడం మధ్య ప్రతిపక్షాలకు తేడా తెలియదని, అటువంటి వ్యతిరేక ఆలోచనా ధోరణిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గతంలో ఆస్తులు, కార్లు, దుకాణాలు పురుషుల పేరుమీదే రిజిస్టరయ్యేవని, తాను వచ్చాక మహిళల పేరుమీద రిజిస్టరు చేయడం ప్రారంభించామని చెప్పారు.

  • ప్రధాని మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. 30 ఎకరాల్లో రూ.450 కోట్లతో ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ హంగులతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ తెందుల్కర్‌, రవి శాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్‌ చేశారు. త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్‌ స్టాండ్‌ నిర్మించనున్నారు. గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్‌ షీట్‌లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సుమారు 30,000 సీటింగ్‌ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు.
  • ఉత్తర్‌ ప్రదేశ్‌లో అవసరార్థ పిల్లల కోసం 16 గురుకుల పాఠశాలలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వాటికి మాజీ ప్రధాని వాజ్‌పేయీ పేరు వచ్చేలా ‘అటల్‌ ఆవాసియా విద్యాలయాస్‌’ అని పెట్టారు. రూ.1,115 కోట్లతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు. 10 నుంచి 15 ఎకరాల్లో ఉండే ఒక్కో పాఠశాలలో 1,000 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. కూలీలు, నిర్మాణ రంగ కార్మికుల పిల్లలతోపాటు కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. వీటిని జాతికి అంకితం చేసే ముందు కొందరు విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.
  • కాశీలోని ప్రజలే ఆ నగరానికి బ్రాండ్‌ అంబాసిడర్లని మోదీ పేర్కొన్నారు. పాఠశాలలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశీలోని విశేషాలను పర్యాటకులకు చూపించడంలో పోటీ పడాలని పిలుపునిచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని