‘బటర్‌ చికెన్‌’ వివాదంలో పరువు నష్టం వ్యాఖ్యలు

దేశంలో ప్రసిద్ధి గాంచిన ‘బటర్‌ చికెన్‌’, ‘దాల్‌ మఖానీ’ వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుపాకానపడింది.

Published : 27 Mar 2024 04:24 IST

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన దర్యాగంజ్‌

దిల్లీ: దేశంలో ప్రసిద్ధి గాంచిన ‘బటర్‌ చికెన్‌’, ‘దాల్‌ మఖానీ’ వంటకాలను ఎవరు కనుగొన్నారన్న అంశంపై మొదలైన న్యాయవివాదం మరింత ముదురుపాకానపడింది. వివాదానికి కేంద్రబిందువులైన దిల్లీకి చెందిన మోతీ మహల్‌, దర్యాగంజ్‌ రెస్టారెంట్ల యజమానుల మధ్య తాజాగా పరువునష్టం వ్యాఖ్యలు వివాదం సృష్టిస్తున్నాయి. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ వార్తాపత్రికలో వచ్చిన ఇంటర్వ్యూలో ‘బటర్‌ చికెన్‌’ మూలంపై మోతీ మహల్‌ యజమానులు చేసిన పరువు నష్టం వ్యాఖ్యలపై దర్యాగంజ్‌ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలు వివిధ వెబ్‌సైట్లలోనూ దర్శనమిచ్చాయని పేర్కొన్నారు. దాంతో తమ రెస్టారెంట్‌ గౌరవానికి భంగం కలిగిందని వివరించారు. మరోపక్క ఇంటర్వ్యూలో వచ్చిన అంశం సంపాదకీయ దృక్పథమని, దానిని తమకు ఆపాదించరాదని మోతీ మహల్‌ యజమానులు వివరించారు. అయితే ఇందుకు సంబంధించి ఓ అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ మోదీ మహల్‌ యజమానులను జస్టిస్‌ సంజీవ్‌ నరులా ఆదేశించారు. తమ పూర్వీకుడైన దివంగత కుందన్‌ లాల్‌ గుజ్రాల్‌..‘బటర్‌ చికెన్‌’, ‘దాల్‌ మఖానీ’ వంటకాలను కనుగొన్నారని, అయితే ఆ రెండు వంటకాలపై దర్యాగంజ్‌.. పౌరులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మోతీ మహల్‌ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశంలో వివాదం మొదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని