మోదీజీ.. మా మొర వినండి

ఫోన్లపై నిఘా, రైతుల ఆందోళనలు, పెట్రోధరల పెరుగుదల వంటి అంశాలపై పార్లమెంటులో తమ అభిప్రాయాలను ప్రభుత్వం వినిపించుకోవడం లేదని ఆరోపిస్తున్న విపక్షం ఆదివారం మూడు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసింది. కీలకాంశాలను

Published : 09 Aug 2021 05:20 IST

డిమాండ్లేమిటో కాస్త చూడండి

వీడియోను విడుదల చేసిన విపక్షం

ఈనాడు, దిల్లీ: ఫోన్లపై నిఘా, రైతుల ఆందోళనలు, పెట్రోధరల పెరుగుదల వంటి అంశాలపై పార్లమెంటులో తమ అభిప్రాయాలను ప్రభుత్వం వినిపించుకోవడం లేదని ఆరోపిస్తున్న విపక్షం ఆదివారం మూడు నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసింది. కీలకాంశాలను లేవనెత్తడానికి ఏయే పార్టీ తరఫున పార్లమెంటులో ఎలాంటి ప్రయత్నం జరిగిందో వివరించేలా రాజ్యసభ వీడియో దృశ్యాలను క్రోడీకరించి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ దీనిని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ‘మోదీ! వచ్చి.. మా మొర వినండి’ అనే పేరుతో వీడియోను రూపొందించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుండడంతో ప్రత్యామ్నాయంగా ఈ వీడియోతో ప్రజల ముందుకు వెళ్తున్నామని ఓబ్రియెన్‌ చెప్పారు. ఇదే వీడియోను రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘పార్లమెంటులో సమాధానాలు చెప్పడానికి ప్రధాని ఎందుకు ముందుకు రావడం లేదు? చర్చకు మేమంతా తయారుగానే ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియకూడదని ప్రభుత్వమే సభను స్తంభింపజేస్తోంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

* గూఢచర్యం అంశంపై కేంద్రం వైఖరిని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తప్పుపట్టారు. ఈ అంశంపై అధికార పార్టీ దాటవేత ధోరణితో వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ను ఓ రబ్బరు స్టాంపుగా మార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పెగాసస్‌ అంశాన్ని త్వరలో పార్లమెంటరీ స్థాయీ సంఘం చర్చిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని