Published : 01/10/2021 05:25 IST

రోడ్ల బందు ఎంతకాలం?

రైతుల ఆందోళనపై సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య

దిల్లీ: రహదారులను ఎల్లకాలం ఎలా అడ్డుకోగలుగుతారని గురువారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థదేనని తెలిపింది. మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన విషయమై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్య చేసింది. ‘‘సమస్యలను న్యాయ వ్యవస్థ ద్వారానో, ఆందోళన ద్వారానో, పార్లమెంటులో చర్చల ద్వారానో పరిష్కరించుకోవచ్చు. ఎంతకాలం పాటు రహదారులను బందు చేస్తారు? దీనికి ముగింపు ఎక్కడ?’’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దిల్లీ శివారులోని యూపీ గేటును మూసివేయడంతో నగరంలోకి వెళ్లేందుకు తాను ఇబ్బంది పడుతున్నానంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ ఈ వ్యాజ్యం వేశారు. దీనిపై ప్రభుత్వం ఏమి చేస్తోందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజ్‌ను ప్రశ్నించగా రైతులతో పలుమార్లు చర్చలు జరిపినట్టు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ ‘‘మేం ఆదేశాలు ఇస్తే కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి చొరబడ్డామని అంటారు’’ అని పేర్కొంది. సొలిసిటర్‌ జనరల్‌ స్పందిస్తూ ఆదేశాలు ఇవ్వాలని తామే కోరినప్పుడు చొరబడడం కిందికి రాదన్నారు. రైతు సంఘాలను కూడా పార్టీగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించాలని కోరారు. రైతు సంఘాలను పార్టీగా చేర్చాలంటూ అధికారికంగా దరఖాస్తు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. శుక్రవారమే దీన్ని సమర్పిస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు. తదుపరి విచారణను 4వ తేదీకి వాయిదా వేసింది.

జంతర్‌మంతర్‌ దీక్షకు అనుమతివ్వండి
జంతర్‌మంతర్‌ వద్ద సత్యాగ్రహం చేయడానికి అనుమతించాలని కోరుతూ కిసాన్‌ మహాపంచాయత్‌ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని శుక్రవారం జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణకు చేపట్టనుంది.


తల్లుల వద్దే పిల్లలు పెరగాలి
బాంబే హైకోర్టు తీర్పు

ముంబయి: సహజంగా పిల్లలు తల్లుల వద్దే పెరగాల్సి ఉందని, అప్పుడే వారు అభివృద్ధి చెందుతారని గురువారం బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. టీవీ నటులైన దంపతులు విడాకులు తీసుకోగా అయిదేళ్ల కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్న విషయం జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.శిందే, జస్టిస్‌ ఎన్‌.జె.జమాదార్‌ ధర్మాసనం పరిశీలనకు వచ్చింది. తల్లి నటజీవితంలో బిజీగా ఉన్నందున బిడ్డను తనకు ఇవ్వడమే మంచిదని, కుమారుడు కోసం నటనను కూడా వదులుకుంటానని తండ్రి చెప్పారు. ధర్మాసనం దీంతో ఏకీభవించలేదు. బిడ్డకు తల్లిదండ్రుల ఇద్దరి అనురాగం కూడా అవసరమని, అందువల్ల అతడిని ప్రతి రోజూ తండ్రికి కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని