Updated : 26 Feb 2022 05:47 IST

Ukraine Crisis: ప్రత్యామ్నాయ వ్యూహం

భారతీయుల తరలింపునకు రొమేనియా, హంగరి సరిహద్దుల వినియోగం

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయినవారు అక్కడకు చేరుకోవాలి

భారతీయ జెండా చిత్రాలు.. అమెరికా డాలర్లు దగ్గర పెట్టుకోవాలి

అడ్వైజరీ జారీచేసిన భారత ఎంబసీ

ఈనాడు, దిల్లీ: ఉక్రెయిన్‌ గగనతలం మూసేయడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దుల్లోని దేశాలకు భూమార్గం ద్వారా రప్పించి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి తరలించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్‌కు రావాలనుకున్నవారు హంగరి, రొమేనియా సరిహద్దులకు చేరుకోవాలని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ సూచించింది. వచ్చేటప్పుడు తమ వాహనాలపై భారతీయ జెండా చిత్రాలను ప్రముఖంగా కనిపించేలా అతికించుకొని రావాలని పేర్కొంది. అలాగే అత్యవసర ఖర్చుల కోసం అమెరికా డాలర్లు దగ్గర ఉంచుకోవాలని, వీలైతే కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని కోరుతూ శుక్రవారం అడ్వైజరీ జారీచేసింది. హంగరీ, రుమేనియా సరిహద్దుల సమీప ప్రాంతాల్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు క్రమపద్ధతిలో సరిహద్దులకు రావాలని పేర్కొంది. అలా వచ్చినవారిని అధికారులు రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి విమానాల్లో పంపిస్తారని తెలిపింది. మరోవైపు భారతీయుల తరలింపు ప్రక్రియను సమన్వయం చేసేందుకు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ల్వివ్‌, చెర్న్విట్సి పట్టణాల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ క్యాంప్‌ ఆఫీస్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం బుకారెస్ట్‌ నుంచి రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు భారతీయులను స్వదేశానికి తీసుకొస్తాయని అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం భారత్‌కు చెందిన 470 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి రొమేనియా వైపు బయలుదేరారని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

ఆర్థికసాయం చేసి ఆదుకోండి: ఐఎంఏ

ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా విమానఛార్జీలు భారీగా పెరిగిపోయాయని, అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు వాటిని భరించేశక్తి లేనందున వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రధాని మోదీని కోరింది. ఈమేరకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సహజానంద్‌ ప్రసాద్‌సింగ్‌, జయేష్‌లేలేలు శుక్రవారం ప్రధానికి లేఖ రాశారు.

భారతీయులు భయపడొద్దు: రష్యా

ఉక్రెయిన్‌లోని భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడివారు అక్కడే ప్రశాంతంగా ఉండాలని రష్యా పేర్కొంది. ప్రస్తుత సైనిక దాడితో పౌరులకు ఎలాంటి ముప్పూ లేదని తెలిపింది. ఈమేరకు రష్యా దౌత్యవర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి.

రొమేనియా చేరుకున్న తొలి బ్యాచ్‌

ఉక్రెయిన్‌ నుంచి తరలింపు చర్యల్లో భాగంగా తొలి బ్యాచ్‌ భారతీయులు రొమేనియాకు శుక్రవారం మధ్యాహ్నం సురక్షితంగా చేరుకున్నారు. సుచేవా సరిహద్దు పోస్ట్‌ను దాటి వారు ఆ దేశంలోకి అడుగుపెట్టారు. మరింతమంది భారతీయులు చిన్నచిన్న బృందాలుగా రొమేనియాకు చేరుకునే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. సుచేవా వద్ద ఉన్న మన అధికారుల బృందం.. వారిని బుకారెస్ట్‌కు తరలిస్తుందని, అక్కడి నుంచి అందర్నీ స్వదేశానికి తీసుకొస్తామని  అరిందమ్‌ బాగ్చీ తెలిపారు.

‘అందర్నీ సురక్షితంగా తరలిస్తాం’

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులందర్నీ సురక్షితంగా స్వదేశానికి తరలిస్తామని ఆ దేశంలో భారత రాయబారి పార్థ సత్పథీ భరోసా ఇచ్చారు. విద్యార్థులు కలత చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కీవ్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులతో సత్పథీ శుక్రవారం మాట్లాడారు. ‘‘భారత ప్రభుత్వం తరలింపు కార్యక్రమాలపై పూర్తిగా దృష్టిసారించింది. భారతీయులంతా సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారు. విమానాలు వరుస కడుతున్నాయి. యుద్ధం తరహా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులుంటాయి. అయినప్పటికీ ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న మీరంతా.. కుటుంబసభ్యులు, స్నేహితులతో మాట్లాడండి. మీరు క్షేమంగా ఉన్న సంగతిని వారికి తెలియజేయండి’’ అని విద్యార్థులకు సూచించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని