ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై చెరగనిమచ్చ

మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీలైన పలువురు జడ్జీలు, ఉన్నతాధికారుల బృందం ఆక్షేపణ తెలిపింది. కోర్టు తన వ్యాఖ్యలను వెనక్కు

Published : 06 Jul 2022 03:32 IST

నుపుర్‌శర్మ కేసులో లక్ష్మణరేఖ దాటిన సుప్రీంకోర్టు 

15 మంది హైకోర్టు విశ్రాంత జడ్జీలు, 77 మంది మాజీ ఉన్నతాధికారుల స్పందన

దిల్లీ: మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీలైన పలువురు జడ్జీలు, ఉన్నతాధికారుల బృందం ఆక్షేపణ తెలిపింది. కోర్టు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ‘లక్షణరేఖ’ దాటిందని, అటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని న్యాయవ్యవస్థకు చెరగనిమచ్చగా అభివర్ణించారు. 15 మంది హైకోర్టు మాజీ జడ్జీలు, 77 మంది మాజీ ఉన్నతాధికారులు, 25 మంది ఇతర ప్రముఖులు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. మన న్యాయవ్యవస్థలో ఇమడని ఆ మాటలు దేశంలో ఇంటా బయటా ప్రకంపనలు రేపుతాయన్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య విలువలపై, దేశ భద్రతపై ఇటువంటి ఉదంతాలు తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈ మేరకు 117 మంది సంతకాలతో కూడిన ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేశారు. దీనిపై సంతకాలు చేసినవారిలో బాంబే హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ క్షితిజ్‌ వ్యాస్‌, కేరళ హైకోర్టు మాజీ జడ్జి పి.ఎన్‌.రవీంద్రన్‌, గుజరాత్‌ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌.ఎం.సోని, రాజస్థాన్‌ హైకోర్టు మాజీ జడ్జీలు ఆర్‌.ఎస్‌.రాథోడ్‌, ప్రశాంత్‌ అగర్వాల్‌, దిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌.ఎన్‌.ధింగ్రా తదితరులు ఉన్నారు. మాజీ ఉన్నతాధికారుల పరంగా చూస్తే.. ఐఏఎస్‌ అధికారులుగా పనిచేసిన ఆనంద్‌బోస్‌, ఆర్‌.ఎస్‌.గోపాలన్‌, ఎస్‌.కృష్ణకుమార్‌.. రిటైర్డ్‌ రాయబారి నిరంజన్‌ దేశాయ్‌.. మాజీ డీజీపీలు ఎస్‌.పి.వైద్‌, బి.ఎల్‌.వోహ్రా.. లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే చతుర్వేది (రిటైర్డ్‌), ఎయిర్‌ మార్షల్‌ (రిటైర్డ్‌) ఎస్‌.పి.సింగ్‌ తదితరులు ప్రకటనపై సంతకాలు చేశారు.

కోర్టు ఏం చెప్పిందంటే..

నుపుర్‌శర్మ వ్యవహార సరళిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జులై 1న తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నోటికి వచ్చింది మాట్లాడిన ఆమె దేశం మొత్తాన్ని విద్వేష జ్వాలల్లోకి నెట్టారని, దేశంలో తలెత్తిన అరాచకానికి ఆమె పూర్తి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని కోర్టు పేర్కొంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై నమోదైన కేసులను ఒక్కచోటుకు చేర్చి విచారించాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రతినిధులుగా ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు తమ పరిధులు దాటడం వల్లే తాము బహిరంగ ప్రకటన రూపంలో స్పందించాల్సి వచ్చిందని మాజీ జడ్జీలు, ఉన్నతాధికారుల బృందం పేర్కొంది. దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త అజయ్‌ గౌతం సైతం నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఆక్షేపణ తెలుపుతూ అదేరోజున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాశారు. ఆ లేఖను పిటిషనుగా స్వీకరించాలని ఆయన కోరారు.


సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలు సబబే
  సీజేఐకు ఆలిండియా బార్‌ అసోసియేషన్‌ లేఖ

దిల్లీ: భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మపై సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యల విషయంలో మంగళవారం ‘న్యాయ’ ప్రతినిధులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కోర్టు లక్ష్మణరేఖ దాటిందంటూ మాజీలైన 117 మంది న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు బహిరంగ ప్రకటన చేయగా.. సుప్రీం వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆలిండియా బార్‌ అసోసియేషన్‌ ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాసింది. కోర్టు వ్యాఖ్యల ఉపసంహరణ కోరుతూ వచ్చిన ప్రకటనలు, పిటిషన్లను పట్టించుకోవద్దని.. ఆ ఇద్దరు న్యాయమూర్తులను తాము అభినందిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ మేరకు బార్‌ ఛైర్‌పర్సన్‌, సీనియర్‌ న్యాయవాది ఆదిశ్‌ సి.అగ్గర్‌వాలా లేఖ రాస్తూ.. ‘ఏదైనా కేసు విచారణలో ఉన్నపుడు న్యాయమూర్తులు న్యాయవాదనలు వింటూ నిమగ్నమై ఉంటారు. ఆ సమయంలో కొన్ని సూచనలు చేయడం సహజం. ఒకవేళ అవి అసంబద్ధంగా ఉన్నా పరిశీలనలు మాత్రమే అని గ్రహించాలి’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని