Sonia Gandhi: సోనియాపై ప్రశ్నల వర్షం

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు కొనసాగుతుండగానే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని మంగళవారం ఆరు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మరోవైపు దిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 27 Jul 2022 06:00 IST

 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు  

  నేడూ హాజరుకావాలంటూ సమన్లు

దిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు కొనసాగుతుండగానే నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసులో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని మంగళవారం ఆరు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మరోవైపు దిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీల ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్‌ గాంధీ సహా పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ను జట్టుపట్టిలాగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. శ్రీనివాస్‌పై భౌతిక దాడికి పాల్పడిన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకుంటామని దిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అమృతా గుగులోత్‌ తెలిపారు.

నగదు అక్రమ చలామణి కేసులో రెండో విడత విచారణలో భాగంగా మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌, కుమార్తె ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ప్రియాంక అక్కడే ఉండగా రాహుల్‌ పార్లమెంటుకు వెళ్లిపోయారు. రెండున్నర గంటల పాటు సోనియాను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత భోజన విరామం ఇచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ మొదలైన విచారణ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగింది. సోనియాను ప్రశ్నిస్తున్న సమయంలో ప్రియాంక మరో గదిలో ఉన్నారు. రెండు రోజుల విచారణలో 55 ప్రశ్నలు అడిగినట్లు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 21న తొలిసారి సోనియాను అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. 

ఆందోళన ఉద్రిక్తం

దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌ ఎంపీలు ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి ఫిర్యాదు చేయాలని భావించారు. దీనికోసం పార్లమెంటు నుంచి ర్యాలీగా బయలుదేరిన రాహుల్‌, కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బస్సులలో పోలీసుస్టేషన్లకు తరలించారు. అంతకుముందు పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. రాజ్‌ఘాట్‌ వద్ద సత్యాగ్రహ దీక్షకు పోలీసులు అనుమతించకపోవడంతో రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రదర్శనగా వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌ సహా కాంగ్రెస్‌ ఎంపీలు విజయ్‌ చౌక్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ నాయకులు 250 మందిని అరెస్టు చేశామని, వారిలో 57 మంది ఎంపీలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారందరినీ రాత్రి వరకు నిర్బంధంలో ఉంచి వదిలిపెట్టారు. రాత్రి 8 గంటల సమయంలో రాహుల్‌ గాంధీ.. కింగ్స్‌వే పోలీసు క్యాంపు నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ‘దేశంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. మోదీ ఒక రాజులా ప్రవర్తిస్తున్నార’ని రాహుల్‌ ధ్వజమెత్తారు.


యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై పోలీసుల దౌర్జన్యం

దిల్లీలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ పార్టీ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో జుట్టు పట్టుకొని లాగారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ వర్గాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాయి. పోలీసులు శ్రీనివాస్‌ను చుట్టుముట్టి ఓ వాహనంలోకి నెడుతుండటం వీడియోలో కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని