Updated : 06 Aug 2022 05:52 IST

Supreme Court: దత్తత ప్రక్రియను సరళీకరించాలి

సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: భారత్‌లో చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధానాన్ని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు చర్యలను వివరిస్తూ స్పందనను తెలియజేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘ఏటా ‘కారా’కు 4వేల దత్తతల సామర్థ్యం ఉంది. మరోవైపు దేశంలో మూడు కోట్ల మంది అనాథ పిల్లలు ఉన్నారు. అందువల్ల ఈ ప్రక్రియను మరింత సరళీకరించాలి’’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దివాలాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ద టెంపుల్‌ ఆఫ్‌ హీలింగ్‌’ అనే సంస్థ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

పార్టీ అధ్యక్షులపై కోర్టు ధిక్కరణ చర్యల పిటిషన్‌ కొట్టివేత

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేర నేపథ్యం వెల్లడి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పును పాటించని పార్టీల అధ్యక్షులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజకీయ పార్టీలపై చర్యల బాధ్యత ఎన్నికల సంఘానిదేనని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహల ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యర్థి ఖరారైన తర్వాత 48 గంటల్లోగా, లేదా నామినేషన్‌ దాఖలు ప్రారంభ తేదీకి రెండు వారాల ముందు రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థులపై ఉన్న నేరారోపణలను ఒక ప్రాంతీయ భాష పత్రిక, ఒక జాతీయ పత్రికతో పాటు ఆయా పార్టీల అధికారిక సామాజిక మాధ్యమ వేదికల్లోనూ, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. 2018 సెప్టెంబరులో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. న్యాయవాది బ్రజేశ్‌ సింగ్‌ ఈ విషయాన్ని పిటిషన్‌ ద్వారా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తూ తీర్పును పాటించని పార్టీలపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యక్తుల ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల జప్తుపై కేంద్రం అఫిడవిట్‌.. సుప్రీం అసంతృప్తి

దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకునే వ్యక్తుల ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ ఉపకరణాలను, వాటిలోని సమాచారాన్ని భద్రపరచటానికి సంబంధించిన మార్గదర్శకాలకు గాను కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో ఉండే సమాచారాన్ని, వ్యక్తిగత వివరాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. నేటి రోజుల్లో వాటిపైనే ప్రజలు అధికంగా ఆధారపడుతున్నారని పేర్కొంది. ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజుకు సూచించింది. సెప్టెంబరు 26కు కేసును వాయిదా వేసింది.

టీవీ న్యూస్‌ ఎడిటర్‌పై చర్యలు వద్దు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై కల్పిత వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చిన కేసులో టీవీ న్యూస్‌ఎడిటర్‌ రజనీశ్‌ ఆహూజాపై చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. రాయ్‌పుర్‌, సికర్‌లలో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లపై చర్యలు వద్దని స్పష్టం చేసింది. అయితే, జైపుర్‌లో దాఖలైన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది.

ఎంటీపీ చట్టం పరిధిలోకి అవివాహితలు

అవివాహితకు సురక్షితంగా గర్భస్రావం చేయించుకునే హక్కును నిరాకరించడం ఆమె వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో వైద్యకారణాలతో ముడిపడిన గర్భవిచ్ఛిత్తి చట్టం (ఎంటీపీ) నిబంధనలను వర్తింపచేసే విషయంలో అవివాహితలనూ పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ‘‘చట్టం ప్రకారం కొన్ని మినహాయింపులు అందుబాటులో ఉన్నప్పుడు అవివాహితలకూ 24 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు ఎందుకు అనుమతించకూడదు? ఈ విషయంలో పార్లమెంటు ఉద్దేశం స్పష్టంగా ఉంది. నిబంధనల్లో ‘భర్త’ స్థానంలో ‘భాగస్వామి’ అనే పదాన్ని చేర్చింది. దీన్ని బట్టి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే అంశంలోకి అవివాహితలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టమవుతోంది’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని