మీర్జాపుర్‌ తివాచీలు.. రాజస్థాన్‌ రాళ్లు

నూతన పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలను నిర్వహించేందుకు వీలుగా మిగిలిన పనులన్నింటినీ పూర్తిచేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ కళాకారులు చేతితో నేసిన సుతిమెత్తని

Published : 11 Aug 2022 05:15 IST

 మహారాష్ట్రలో చేసిన టేకు ఫర్నీచర్‌

శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్న నూతన పార్లమెంటు భవనం

ఇంటీరియర్‌, ఫ్లోరింగ్‌ పనులు ప్రారంభించినట్లు అధికారుల వెల్లడి

దిల్లీ: నూతన పార్లమెంటు భవనంలో శీతాకాల సమావేశాలను నిర్వహించేందుకు వీలుగా మిగిలిన పనులన్నింటినీ పూర్తిచేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ కళాకారులు చేతితో నేసిన సుతిమెత్తని తివాచీలు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రాళ్లు, మహారాష్ట్రలో టేకు చెక్కతో తయారుచేసిన గృహోపకరణాలు (ఫర్నీచర్‌) ఇప్పటికే భవనం వద్దకు చేరుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం భవనం లోపలిభాగం (ఇంటీరియర్‌), నేల (ఫ్లోరింగ్‌) పనులు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు నూతన భవనానికి సంబంధించిన పనులు 70 శాతం పూర్తయ్యాయని, నవంబరు 2022 కల్లా మొత్తం పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసిన సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గడువును పొడిగించే ప్రణాళికేమీ ప్రస్తుతానికి లేదని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త పార్లమెంటు భవనంలో కొన్ని భాగాలు రాజ్యాంగ దినోత్సవం జరుపుకొనే నవంబరు 26 నుంచి పనిచేయవచ్చని, ఈ విషయమై ఇప్పటికైతే ఎలాంటి తుదినిర్ణయం తీసుకోలేదని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త భవనంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా చెబుతోంది. కొత్త పార్లమెంటు భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ నిర్మిస్తోంది. భారత ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించేందుకు వీలుగా పెద్ద కాన్‌స్టిట్యూషన్‌ మందిరం, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్‌, గ్రంథాలయం, కమిటీ గదులు, భోజనాల హాలు, విశాలమైన పార్కింగ్‌ స్థలం వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగానే ఉప రాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ సైతం రూపుదిద్దుకుంటోంది. ఇక ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), కేబినెట్‌ సెక్రటేరియట్‌, ఇండియా హౌస్‌, జాతీయ భద్రతా మండలి సచివాలయం వంటివి ఉండనున్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts