‘ నమస్తే ట్రంప్‌’ ఖర్చు రూ.38 లక్షలు

రెండేళ్ల కిందట భారత్‌ను సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రూ.38 లక్షలు ఖర్చు పెట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కేంద్ర

Published : 19 Aug 2022 04:49 IST

దిల్లీ: రెండేళ్ల కిందట భారత్‌ను సందర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రూ.38 లక్షలు ఖర్చు పెట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపింది. 2020 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్‌ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు. 36 గంటలపాటు మన దేశంలో జరిపిన ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి గుజరాత్‌లోని మోతెరా క్రికెట్‌ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు భారత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో తెలియజేయాలంటూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మిశల్‌ భటెనా 2020 అక్టోబరు 24న దరఖాస్తు చేశారు. దీనికి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అప్పీలుకు వెళ్లి, తుది ప్రయత్నంగా సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఆలస్యానికి కొవిడ్‌-19ను కారణంగా చూపుతూ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పై సమాచారం ఇచ్చింది. అంతర్జాతీయ నియమాల ప్రకారమే ఈ ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని