ఉచిత హామీల అమలు వల్ల ఆర్థిక భారమెంతో చెప్పాలి

ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలను అమలుపరిస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంతమేరకు ప్రభావం ఉంటుందో అంచనా వేసి ముందుగానే ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సిందిగా రాజకీయ పార్టీలను ఆదేశించే అవకాశాన్ని పరిశీలించాలని

Published : 20 Aug 2022 06:04 IST

ఆ దిశగా రాజకీయ పార్టీలను ఆదేశించే అవకాశాలను పరిశీలించండి
సుప్రీంకోర్టును కోరిన అశ్వినీ ఉపాధ్యాయ్‌

దిల్లీ: ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలను అమలుపరిస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంతమేరకు ప్రభావం ఉంటుందో అంచనా వేసి ముందుగానే ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సిందిగా రాజకీయ పార్టీలను ఆదేశించే అవకాశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును సీనియర్‌ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ కోరారు. ఆయా హామీలు/విధానాలతో ఎంతమందికి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయో కూడా చెప్పేలా ఆదేశాలు జారీ చేయొచ్చని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఇష్టారీతిన ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. దానికి జతగా ఆయన కోర్టుకు శుక్రవారం మరికొన్ని అంశాలను నివేదించారు. ‘‘రాజకీయ పార్టీలు ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రకటించొచ్చు. ఆ విషయంలో వివాదమేమీ లేదు. అయితే ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రకటించే పథకాల అమలు వల్ల ప్రభుత్వంపై ఎంత ఆర్థిక ప్రభావం ఉంటుందో ఓటర్లకు తెలియడం అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-324 కింద ఎన్నికల సంఘం తన ప్లీనరీ అధికారాన్ని ఉపయోగించుకొని.. ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలను అమలుచేస్తే ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? వాటివల్ల ఖజానాపై ఎంత ప్రభావం ఉంటుంది? వంటి అంశాలను తమకు ముందే తెలియజేయాలని పార్టీలను ఆదేశించొచ్చు’’ అని ఉపాధ్యాయ్‌ తెలిపారు. ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులు తమపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పిన సంగతిని గుర్తుచేశారు. అదే తరహాలో హామీల అమలు ప్రభావానికి సంబంధించిన మదింపు సమాచార సమర్పణనూ తప్పనిసరి చేయొచ్చని పేర్కొన్నారు. దీనిపై సూచనలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఆర్థిక కమిషన్‌, నీతి ఆయోగ్‌ సహా అన్ని పక్షాలను సుప్రీంకోర్టు కోరింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని