సంక్షిప్త వార్తలు(6)

మతస్వేచ్ఛలో ఇతరుల మతం మార్చే హక్కులేదని సుప్రీంకోర్టుకు గుజరాత్‌ తెలిపింది.

Updated : 05 Dec 2022 05:45 IST

మతస్వేచ్ఛలో ఇతరుల మతం మార్చే హక్కులేదు
సుప్రీంకోర్టుకు తెలిపిన గుజరాత్‌

దిల్లీ: మతస్వేచ్ఛలో ఇతరుల మతం మార్చే హక్కులేదని సుప్రీంకోర్టుకు గుజరాత్‌ తెలిపింది. అలాగే, వివాహం ద్వారా మతం మార్చుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి తప్పనిసరి చేసే రాష్ట్ర చట్టం నిబంధనపై గుజరాత్‌ హైకోర్టు విధించిన స్టేను కూడా రద్దు చేయాలని అభ్యర్థించింది. దేశంలో బలవంతపు, మోసపూరిత మతమార్పిళ్ల నియంత్రణకు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ్‌ గతంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి స్పందనగా.. గుజరాత్‌లో బలవంతపు మతమార్పిళ్లను నిషేధించే నిబంధనను అమలు చేయడానికి హైకోర్టు స్టేను రద్దు చేయాలంటూ ఓ దరఖాస్తును సమర్పించినట్లు గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది.


అవసరం లేని నిర్మాణ పనులపై దిల్లీలో నిషేధం!

దిల్లీ: దిల్లీలో మళ్లీ కాలుష్యం విజృంభించింది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సగటు వాయు నాణ్యత సూచీ 407గా నమోదైంది. ఈ నేపథ్యంలో దిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో అవసరం లేని నిర్మాణ పనులపై నిషేధం విధించాలని కేంద్ర వాయు నాణ్యత మండలి అధికారులను ఆదేశించింది.


దేశాన్ని భద్రంగా కాపాడుతున్న నౌకా దళం

నావికా దినోత్సవం సందర్భంగా నేవీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. దేశ ఘన సముద్ర చరిత్ర గురించి భారతీయులంతా గర్విస్తున్నారు. నౌకా దళం మన దేశాన్ని భద్రంగా కాపాడుతోంది. విపత్కర పరిస్థితుల్లో మానవతా స్ఫూర్తిని ప్రదర్శించి తన ప్రత్యేకతను చాటుకుంది.

 నరేంద్ర మోదీ


ఒక్క నెలలో 2.63 లక్షల ఉద్యోగాలు

అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాం. దీని ఫలితంగా నవంబరులో 2.63 లక్షల కొత్త ఉద్యోగాలు యువతకు లభించాయి. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ 1.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాం. నిరుద్యోగ రేటు 50 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

 బైడెన్‌


వంద శాతం విద్యుదీకరణ దిశగా రైల్వే

భారతీయ రైల్వే వంద శాతం విద్యుదీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఉత్తర రైల్వే పరిధిలోని మురాదాబాద్‌-రామ్‌నగర్‌ మార్గాన్ని విద్యుదీకరణ చేసే ప్రక్రియ పూర్తయింది. దీంతో ఉత్తరాఖండ్‌ రైల్వే నెట్‌వర్క్‌ సంపూర్ణ విద్యుదీకరణ ప్రాంతంగా నిలిచింది. కార్బన్‌ ఉద్గారాలను అరికట్టే దిశగా మరో కీలక అడుగు పడింది.

 రైల్వే మంత్రిత్వ శాఖ


ఇరాన్‌ మహిళలు సాధించారు

హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను వ్యతిరేకిస్తూ ఇరాన్‌ మహిళలు రెండు నెలలకు పైగా నిరసనలు కొనసాగించారు. దీంతో అక్కడి ప్రభుత్వం దిగివచ్చి నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసింది.    శాంతియుత నిరసనలతో ఇరాన్‌ మహిళలు సాధించారు. 

తస్లీమా నస్రీన్‌


ఆగంతుకుడు ఇచ్చిన చాక్లెట్లు  తినడంతో విద్యార్థులకు అస్వస్థత
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘటన

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో విషాదం నెలకొంది. తన పుట్టినరోజంటూ గుర్తుతెలియని వ్యక్తి పంచిన చాక్లెట్‌లు తిన్న 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నార్త్‌ అంబజారి రోడ్డులోని మదన్‌ గోపాల్‌ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 3, 4, 5 తరగతి విద్యార్థులు భోజన విరామ సమయంలో పాఠశాల ప్రహరీ బయట ఆడుకుంటున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కారులో వచ్చి.. విద్యార్థులకు చాక్లెట్లు పంచాడు. వాటిని తిన్న విద్యార్థులు గంట వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి, వాంతులు తదితర సమస్యలతో బాధపడ్డారు. వెంటనే వారిని లతా మంగేష్కర్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


పెళ్లి కోసం విమానాన్ని బుక్‌ చేసిన జంట

జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి చేసుకుంటామని అందరూ ఉన్నంతలో కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తుంటారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన వధూవరులు ఇలాగే ఆలోచించారు. అతిథుల కోసం ఏకంగా విమానాన్నే బుక్‌ చేశారు.  అందరూ విమానంలో కూర్చొని కేరింతలు కొడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయ సాహ్‌ అనే డిజిటల్‌ క్రియేటర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు.


మహిళ పొట్టలో 3.5 కిలోల కణితి

పంజాబ్‌ వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స చేసి మహిళ పొట్టలో నుంచి 3.5 కిలోల కణితిని తొలగించారు. శుక్రవారం జరిగిన ఈ చికిత్స కోసం దాదాపు నాలుగు గంటలపాటు వైద్యులు శ్రమించారు. అమృత్‌సర్‌లోని బల్జీందర్‌సింగ్‌ భార్య కుల్బీర్‌కౌర్‌ గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యపరీక్షలు చేయగా.. కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు  గుర్తించారు. చాలా ఆస్పత్రులకు తిరిగారు. అధిక మొత్తంలో ఖర్చవుతుందని చెప్పడంతో.. చివరకు నాగ్‌కలాన్‌లోని బాబా ఫరీద్‌ ఛారిటబుల్‌ ఆస్పత్రికి బాధితులు వచ్చారు. ఈ ఆసుపత్రిలోని డాక్టర్‌ రాజ్‌బీర్‌సింగ్‌ బజ్వా బృందం తక్కువ ఖర్చుతో ఆమెకు శస్త్రచికిత్సను పూర్తి చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు