ప్రభుత్వ వ్యవస్థలు లక్ష్మణరేఖను మీరొద్దు

రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు తీసుకొచ్చిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’(ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ తీవ్రంగా ఆక్షేపించారు.

Published : 08 Dec 2022 04:40 IST

తొలి ప్రసంగంలో రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌

దిల్లీ: రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు తీసుకొచ్చిన ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’(ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ తీవ్రంగా ఆక్షేపించారు. చట్టసభల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నార్థకం చేసిన చర్యగా దీనిని అభివర్ణించారు. రాజ్యాంగంలో భాగమైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ పరిధులను అతిక్రమించరాదని, లక్ష్మణ రేఖను గౌరవించాలని ఆయన సూచించారు. ఒక వ్యవస్థ అధికార పరిధిలోకి మరో వ్యవస్థ చొరబడితే మొత్తం పరిపాలనే కుప్పకూలుతుందని హెచ్చరించారు. ఎగువసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ధన్‌ఖడ్‌ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. జడ్జీల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2014 ఆగస్టులో ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌’(ఎన్‌జేఏసీ) బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. 2015 అక్టోబరులో సుప్రీంకోర్టు ఈ బిల్లును రద్దు చేసింది. ఉభయసభల్లోనూ ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును న్యాయవ్యవస్థ తోసిపుచ్చడం పార్లమెంటరీ సార్వభౌమత్వాన్ని, ప్రజల తీర్పును ఉల్లంఘించడమేనని ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. చట్టసభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, అడ్డుకోవడం వంటివి ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలని సభ్యులకు గుర్తు చేశారు. రాజ్యసభ నేత పీయూష్‌ గోయల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు, విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని, జేడీ(ఎస్‌) అధ్యక్షుడు హెచ్‌.డి.దేవెగౌడ తదితరులు నూతన ఛైర్మన్‌కు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని