XE variant: ముంబయిలో ‘ఎక్స్‌ఈ వేరియంట్‌’ కలకలం.. తమిళనాడు సర్కార్‌ అలర్ట్‌!

దేశంలో తొలిసారి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కేసు మహారాష్ట్రలోని ముంబయి నగరంలో బయటపడటంతో తమిళనాడు ప్రభుత్వం.......

Published : 08 Apr 2022 02:00 IST

చెన్నై: దేశంలో తొలిసారి ఒమిక్రాన్‌ ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కేసు మహారాష్ట్రలోని ముంబయి నగరంలో బయటపడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్‌ కేసులేమీ నమోదు కాలేదని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్‌ స్పష్టంచేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులపై నిఘా ముమ్మరం చేయాలని విమానాశ్రయాల అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతుండటంతో అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఒక్క ఇన్ఫెక్షన్‌ను గుర్తించినా కాంటాక్టు ట్రేసింగ్‌ చేయాలన్నారు. 

‘‘తమిళనాడులో కొత్త వేరియంట్‌ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్రలో ఎక్స్‌ఈ వేరియంట్‌ బయటపడినట్టు తేలినా.. కేంద్రం ఆ వార్తల్ని తోసిపుచ్చింది. అది మంచి వార్తే. మేం మాత్రం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాలని విమానాశ్రయ అధికారులకు సూచించాం’’ అని మంత్రి పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు (చెన్నై, తిరుచిరాపల్లి, మదురై, కోయంబత్తూరు) ఉండగా.. ఆయా ఎయిర్‌పోర్టుల వద్ద ఫీవర్‌ స్క్రీనింగ్‌ క్యాంపులను నిరంతరం నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. చెన్నై, చెంగల్‌పేట్‌, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయనీ.. ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చినా కాంటాక్టు ట్రేసింగ్‌ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం, ఆరోగ్యశాఖకు సూచించినట్టు తెలిపారు. ఒక్క కేసే 100.. ఆ తర్వాత 1000కి పెరుగుతుందని హెచ్చరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని