Covid Deaths: WHO తీరు దుర్మార్గం.. స్పందించిన ఆరోగ్య శాఖ వర్గాలు

భారత్‌లో కరోనా మరణాల నివేదిక విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు దుర్మార్గమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

Published : 06 May 2022 14:37 IST

సైన్స్‌ అబద్ధం చెప్పదని రాహుల్ మండిపాటు

దిల్లీ: భారత్‌లో కరోనా మరణాల నివేదిక విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరు దుర్మార్గమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకు కొవిడ్ డేటాను ముందుగానే అందించాం. అదనంగా సమాచారాన్ని జత చేయడానికి ముందు మేమిచ్చిన సమాచారాన్ని విశ్లేషించాల్సింది. భారత్‌ కరోనా సమాచారం విషయంలో డబ్ల్యూహెచ్‌వో వైఖరి దుర్మార్గంగా ఉంది’ అంటూ నిరసనగా స్పందించాయి.  

కొవిడ్‌ ప్రభావంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లలో దాదాపు 1.50 కోట్ల మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. భారత్‌లోనే 47.40 లక్షల మరణాలు సంభవించి ఉండొచ్చని గురువారం తాజా నివేదికలో పేర్కొంది. 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు కొవిడ్‌ ప్రభావంతో మరణాలపై డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనాలను రూపొందించింది. ఈ రెండేళ్లలో కొవిడ్‌ సోకి నేరుగాను.. మహమ్మారి ప్రభావం ఆరోగ్య వ్యవస్థపైనా, సమాజంపైనా పడటంతోను.. మృతిచెందిన వారి సంఖ్య 1.33 కోట్ల నుంచి 1.66 కోట్ల మధ్య ఉండొచ్చని లెక్క కట్టింది. భారత్‌కు సంబంధించి.. అధికారిక లెక్కలకు అనుగుణంగా తమ అంచనాలు ఉండకపోవచ్చని, డేటాలో తేడాలు, తాము అనుసరించే విధానాలే దీనికి కారణమని పేర్కొంది.

ఈ అంచనాలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో అనుసరిస్తున్న లెక్కింపు విధానాన్ని తోసిపుచ్చింది. కొవిడ్‌ మరణాల లెక్కింపునకు డబ్ల్యూహెచ్‌వో అనుసరిస్తున్న గణిత విధానాలపై భారత్‌ ఎప్పటికప్పడు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నా.. పట్టించుకోకుండా ఈ అంచనాలను విడుదల చేయడమేమిటని ప్రశ్నించింది. డబ్ల్యూహెచ్‌వో నివేదిక ఆమోదయోగ్యం కాదని, దురదృష్టకరమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఖండించారు. భారత్‌లో అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి 5.24 లక్షల మంది కొవిడ్‌ కారణంగా మృతిచెందగా.. డబ్ల్యూహెచ్‌వో తాజా అంచనాలు అంతకు 9 రెట్లకు పైగా ఉండటం గమనార్హం.

సైన్స్‌ అబద్ధం చెప్పదు: రాహుల్

దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సైన్స్ అబద్ధం చెప్పదంటూ మండిపడ్డారు. ‘కొవిడ్ మహమ్మారి కారణంగా భారత్‌లో 47 లక్షల మంది మరణించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా 4.8 లక్షలు కాదు. సైన్స్ అబద్ధం చెప్పదు. మోదీ ఆ పని చేస్తారు. తమ ఆప్తుల్ని కోల్పోయిన కుటుంబాలను గౌరవించండి. వారికి రూ.4లక్షల పరిహారం ఇచ్చి మద్దతు తెలపండి’ అంటూ ఆరోగ్య సంస్థ గణాంకాలను ట్వీట్ చేశారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని