ముంబయి, నాగ్‌పూర్‌లలో కఠిన ఆంక్షలు

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంటే మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రారంభం నుంచి ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి.

Published : 19 Feb 2021 17:13 IST

కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం
ముంబయిలో మాస్కుల కోసం మార్షల్స్‌

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంటే మహారాష్ట్రలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా ప్రారంభం నుంచి ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మహా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేసింది. శుక్రవారం నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎంసీ) కూడా కొత్త నిబంధనలను ప్రకటించింది. హోటళ్లలో 50శాతం వినియోగదారులు, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే ఉండాలని ఎన్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఒక భవనంలో 5 కంటే ఎక్కువ కరోనా కేసులుంటే ఆ భవనాలకు సీల్‌ వేస్తామని తెలిపారు.

సుమారు 75 రోజుల తర్వాత మహారాష్ట్రలో 5వేల కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువ శాతం కేసులు అకోలా, నాగ్‌పూర్‌ పరిధిలో నమోదవుతున్నట్లు వారు వెల్లడించారు. యావత్మల్‌ జిల్లాలో పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ శైలేశ్‌ నావల్‌ గురువారం ప్రకటించారు. పరిస్థితి మరింత చేజారకముందే ప్రజలు మేలుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే గతంలో హెచ్చరించారు. మళ్లీ లాక్‌ డౌన్‌ విధించాలా? వద్దా అనేది ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు.

మాస్కులు ధరించేందుకు మార్షల్స్‌

మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఒక్క సారిగా పెరగడంతో అధికారులు కట్టడి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా చాలా మంది ప్రజలు మాస్కులు ధరించట్లేదని గుర్తించిన అధికారులు ప్రజల చేత మాస్కులు ధరించేలా చేసేందుకు మార్షల్స్‌ను నియమించారు. ముంబయిలో సుమారు 5వేల మంది మార్షల్స్‌ను దీని కోసం నియమించారు. వారిలో చాలా మందిని రైల్వే స్టేషన్లలో ఉంచామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని