Chhattisgarh: నిజానికి మేం బలైపోవాల్సింది.. కానీ, దేవుడే మమ్మల్ని కాపాడాడు

Dantewada Naxal Attack: అప్పటి వరకు మాతోపాటు ఉన్న కలిసి తిరిగిన వారు ప్రాణం లేకుండా విగత జీవులుగా పడి ఉండటం చూస్తే ఎంతో బాధగా ఉంది. నిజానికి మా వాహనం ఆ దాడికి బలైపోవాల్సిందే. దేవుడే మమ్మల్ని కాపాడాడు.

Updated : 27 Apr 2023 18:44 IST

దంతెవాడ: అప్పటిదాకా మరో వాహనంలో తమ వెనకే వచ్చారు. ముందుగా గమ్యస్థానాన్ని చేరుకోవాలని వాహనం వేగాన్ని పెంచారు. కానీ, అదే వారి చివరి మజిలీ అవుతుందని ఊహించలేకపోయారు. బుధవారం దంతెవాడలో మావోయిస్టులు (Dantewada Naxal Attack) అమర్చిన మందుపాతర పేలి 10 మంది డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు (DRG) జవాన్లతోపాటు మినీ బస్సు డ్రైవర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మినీ బస్సు వెనుక వస్తోన్న మరో ప్రయివేటు వాహనం డ్రైవర్‌ ప్రత్యక్షంగా తాను చూసిన భయానక ఘటనను వివరించాడు. 

‘‘నిజానికి ఆ మందుపాతరకు మా వాహనం బలైపోవాల్సింది. దేవుడే మమ్మల్ని కాపాడాడు. మావోయిస్టుల కోసం గాలింపు ముగిసిన తర్వాత కొంతమంది జవాన్లు నా వాహనంలో ఎక్కారు. మా ముందు మరో వాహనంలో డీఆర్జీ జవాన్లు, వెనుక మరో మూడు వాహనాల్లో డీఆర్జీ జవాన్లు, కేంద్ర బలగాల కాన్వాయ్‌ ఉన్నాయి. ఘటనా స్థలానికి 200 మీటర్ల దూరంలో పాన్‌ మసాలా తినేందుకు నా వాహనం వేగాన్ని తగ్గించాను. ఆ సమయంలో మా వెనుక 10 మంది డీఆర్జీ జవాన్లతో వస్తోన్న మినీ బస్సు మమ్మల్ని దాటుకుని ముందుకు వెళ్లింది. అలా, కొంత దూరం వెళ్లాక పెద్ద ఎత్తున శబ్దంతో మినీ బస్సు గాల్లోకి ఎగరడం, తర్వాత పొగ కమ్ముకోవడం కనిపించింది. ఆ శబ్దానికి నా వాహనంలో ఉన్న జవాన్లు కిందకు దిగి అడవిలోకి కాల్పులు జరపడం ప్రారంభించారు. భయంతో నేను కారు కింద దాక్కున్నాను. కొద్ది సేపటి తర్వాత చూస్తే.. రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడింది. రోడ్డు పక్కన జవాన్ల మృతదేహాలు భయానక రీతిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనతో నేను ఒక్కసారిగా షాక్‌ గురయ్యాను. బతికున్నంత కాలం ఆ భయానక ఘటనను మర్చిపోలేను. దాడికి గురైన వాహనం డ్రైవర్‌ ధనిరామ్‌ యాదవ్‌, నేను మంచి స్నేహితులం. అప్పటివరకు మాతోపాటు కలిసి తిరిగిన వ్యక్తులు లేరనేది ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది’’ అని వివరించాడు. 

మావోయిస్టుల దాడి నేపథ్యంలో 200 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, డీఆర్జీ బృందాలు దంతెవాడ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఘటన అనంతరం వెనుక వాహనంలోని జవాన్లు అప్రమత్తమై, రోడ్డుపైకి రావడం, కాల్పుల శబ్దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో అమరులైన జవాన్లకు గురువారం ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ (Bhupesh Baghel) నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దాడిని తీవ్రంగా ఖండించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని