ICMR: యాంటీబయోటిక్స్‌ వాడకం విషయంలో ఐసీఎంఆర్‌ హెచ్చరిక!

యాంటీబయోటిక్స్‌ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్‌ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం(Anti-microbial Resistance) పెరుగుతోందని వెల్లడించింది.

Published : 27 Nov 2022 23:33 IST

దిల్లీ: యాంటీబయోటిక్స్‌ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి(ICMR) తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్‌ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం(Anti-microbial Resistance) పెరుగుతోందని వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం సవాల్‌గా మారుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్వల్ప జ్వరం, శ్వాసనాళాల్లో వాపు (వైరల్‌ బ్రాంకైటిస్‌) వంటి అనారోగ్యాలకు యాంటీబయోటిక్స్ వాడకంపై హెచ్చరికలు జారీ చేసింది. రోగులకు యాంటీబయోటిక్స్‌ను సూచించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులకు సలహా ఇచ్చింది.

చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్‌లకు ఐదు రోజులు, సాధారణ న్యుమోనియా విషయంలో ఐదు రోజులు, ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోకిన న్యుమోనియాకు ఎనిమిది రోజుల యాంటీబయోటిక్‌ చికిత్స అందించాలని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు జ్వరం, ప్రోకాల్సిటోనిన్ స్థాయిలు, తెల్ల రక్తకణాల సంఖ్య, రేడియాలజీ వంటివాటిపై ఆధారపడకుండా.. క్లినికల్‌ డయోగ్నసిస్‌ చేపట్టాలని పేర్కొంది. తద్వారా సరైన యాంటీబయోటిక్‌ ఇవ్వొచ్చని తెలిపింది. రక్త పరీక్షలు, సంబంధిత యాంటీబయోటిక్‌ పనిచేస్తుందా? లేదా? అనేది పరీక్షించకముందే అందించే యాంటీబయోటిక్‌ చికిత్సా విధానాన్ని(ఎంపిరిక్‌ యాంటీబయాటిక్‌ థెరపీ) తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారి విషయంలో తగ్గించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని