Bharat: ‘భారత్‌’ కోసం అభ్యర్థన వస్తే.. దేశం పేరుపై ఐరాస ఏమందంటే..?

Bharat: ‘భారత్‌’ పేరు అంశంపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో టర్కీ తన పేరును తుర్కియేగా మార్చుకున్న విషయాన్ని గుర్తుచేసింది. 

Published : 07 Sep 2023 10:03 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ (President of Bharat)’ పేరిట రాష్ట్రపతి నుంచి ఆహ్వానాలు రావడంతో దేశం పేరుపై రాజకీయ వివాదం మొదలైంది. దీనిపై తాజాగా ఐక్యరాజ్య సమితి (United Nations) కూడా స్పందించింది. తమ పేర్ల మార్పుపై దేశాల నుంచి అభ్యర్థనలు వస్తే.. ఐరాస వాటిని స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది.

‘ఇండియా (India)’ దేశం పేరు ఆంగ్లంలోనూ ‘భారత్‌ (Bharat)’గా మారనుందా?అని విలేకరులు అడిగిన ప్రశ్నపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ స్పందించారు. గతేడాది టర్కీ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న విషయాన్ని ఉదహరించారు.  ‘‘తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక అభ్యర్థనను మేం స్వీకరించి సానుకూలంగా స్పందించాం. అలాగే.. ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం’’ అని హక్‌ తెలిపారు.

‘భారత్‌’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి : మోదీ సూచన

జీ-20 సదస్సు (G20 Summit) కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ఆహ్వాన పత్రికల్లో 'President of India'కు బదులుగా 'President of Bharat' అని ముద్రించడంతో ఈ వివాదం మొదలైంది. అంతేగాక, 20 మంది విదేశీ అతిథులకు పంపిణీ చేయనున్న పుస్తకాల్లోనూ ఇండియాకు బదులు భారత్‌ అని పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ (PM Modi)ని కూడా ‘ది ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ భారత్‌’ అని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇకపై దేశం పేరు ఆంగ్లంలోనూ ‘ఇండియా’ స్థానంలో ‘భారత్‌’గా స్థిరీకరించేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

దీంతో ఈ వ్యవహారంపై వివాదం రాజుకుంది. ఈ మార్పుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే, భాజపా నేతలు మాత్రం ఈ చర్యను సమర్థించారు. రాజ్యంగం ప్రకారం దేశం పేరు ‘భారత్‌’ అని ఉందని, అలా రాయడంలో తప్పులేదని పేర్కొన్నారు. అటు ప్రధాని మోదీ కూడా దీనిపై స్పందిస్తూ.. కేంద్ర మంత్రులకు పలు సూచనలు చేసినట్లు వార్తలొచ్చాయి. ‘భారత్‌’ అంశంపై ఆచిచూతి వ్యవహరించాలని, అనవరస వ్యాఖ్యాలను చేయొద్దని సూచించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని