Jaishankar: మా విద్యార్థులకు వీసాలు ఇవ్వండి: జైశంకర్‌

వలసవాదం ముగిసిన తర్వాత ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించే బాధ్యత భారత్‌, న్యూజిల్యాండ్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. న్యూజిల్యాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ననైయా మహుతాతో ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు.

Published : 06 Oct 2022 20:31 IST

ఆక్లాండ్‌:  ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించే బాధ్యత భారత్‌, న్యూజిలాండ్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ననైయా మహుతాతో ఇవాళ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఇండో ఫసిపిక్‌ రీజియన్‌లో భద్రత, ఉక్రెయిన్‌ సంక్షోభం తదితర అంశాలపై చర్చించారు. విదేశాంగ మంత్రి హోదాలో ఈ దేశంలో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఆశాజనక దిశగా సాగాయంటూ సమావేశం అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రితో చర్చలు ఉపయుక్తంగా, ఉత్పాదకత దిశగా జరిగాయి. ఇరు దేశాలు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తాయి. ఈ సమకాలీన బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు ఇరుదేశాలూ యత్నిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇండో-ఫసిపిక్‌, ఉక్రెయిన్‌ సంక్షోభం తదితర అంతర్జాతీయ అంశాలపైనా చర్చించామని, ఇరుదేశాల అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఫోరమ్‌లలో న్యూజిలాండ్‌తో కలిసి పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు జైశంకర్‌ చెప్పారు. ప్రధానంగా వ్యాపార, విద్య, సాంకేతికత, డిజిటల్‌ వరల్డ్‌, వ్యవసాయం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనే చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో న్యూజిలాండ్‌లో భారత విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైనా చర్చించారు. కొవిడ్‌ సమయంలో స్వదేశానికి వచ్చి, పరిస్థితులు సర్దుకున్న తర్వాత తిరిగివారి వీసాలను పునరుద్ధరించలేదని ఆ దేశ దృష్టికి తీసుకెళ్లారు.వారికి వీసాలు మంజూరు చేసి చదువు కొనసాగించేందుకు సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని