Lok Sabha polls: ఎన్నికల తర్వాతే.. ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం : రాహుల్‌

ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు కొనసాగుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Updated : 05 Apr 2024 14:13 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాతే విపక్షాల కూటమి ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ప్రస్తుతం తాము సైద్ధాంతికంగా పోరాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారు, వాటిని రక్షించే శక్తుల మధ్యే తాజా పోరు అని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో (Congress Manifesto) విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాహుల్‌ సమాధానమిచ్చారు.

‘‘2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు కూడా భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ‘భారత్‌ వెలిగిపోతోందంటూ’ ప్రచారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. అప్పుడు కాషాయ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికలు ఏకపక్షం అంటూ బయట ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉంది. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైద్ధాంతిక పోరు చేస్తోంది. ఇందులో కూటమిదే విజయం. ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

నాకెందుకు టికెట్ ఇవ్వలేదు: వేదికపై చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన పప్పూయాదవ్

‘న్యాయ్‌పత్ర’ పేరుతో కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు తెలిపింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం కోటా, అగ్నిపథ్‌ పథకం రద్దు, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, రైట్‌ టూ అప్రంటీస్‌ చట్టం, విద్యా రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజుల రద్దు వంటి హామీలను కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని