India Corona: నిర్ధారణ పరీక్షలు తగ్గినా.. 4 వేల పైనే కొత్త కేసులు..!

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు నాలుగు వేలకు పైగా వస్తున్నాయి. క్రియాశీల కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి.

Published : 06 Jun 2022 10:11 IST

ఆందోళన కలిగిస్తోన్న పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నాలుగు వేలకు పైగానే వస్తున్నాయి. క్రియాశీల కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు వరుసగా రెండోరోజు ఒకశాతం పైగా నమోదైంది. సోమవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 

ఆదివారం 2.78 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 4,518 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 4.13 లక్షల మందిని పరీక్షిస్తే.. 4,270 కేసులొచ్చాయి. తాజాగా పరీక్షల సంఖ్య తగ్గినా.. నాలుగువేలకు పైగానే కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివిటీ రేటు 1.62 శాతానికి పెరిగింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.31 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. 

మరోవైపు క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 25,782కు ఎగబాకింది. ఆ రేటు 0.06 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,779 మంది కోలుకోగా.. మొత్తంగా 4.26 కోట్ల(98.73 శాతం) మందికి పైగా వైరస్‌ను జయించారు. నిన్న 9 మరణాలు నమోదయ్యాయి. సెలవురోజు కావడంతో నిన్న 2.57 లక్షల మందే టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 194 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని