India Corona: ఆగని కరోనా ఉద్ధృతి.. వరుసగా నాలుగో రోజూ 3 లక్షల పైనే!

దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి....

Updated : 23 Jan 2022 10:10 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. శనివారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గినప్పటికీ.. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,33,533 మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కొత్తగా మరో 525 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండేళ్ల వ్యవధిలో 3.89 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,89,409 మంది మరణించారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు సంఖ్య 21,87,205గా ఉంది. ఆ కేసుల రేటు 5.57 శాతానికి పెరిగింది. కొత్తగా మరో 2,59,168 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 3,65,60,650 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. మరోవైపు శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారిలో 4,15,77,103 మందికిపైగా టీకా తొలి డోసు తీసుకున్నారు. అలాగే మొత్తం 80,10,256 మందికి ప్రికాషనరీ డోసులు పంపిణీ చేశారు. 

మహారాష్ట్రలో కొత్తగా 46,393 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 మందికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు తేలింది. ఇక 48 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. శనివారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గడం గమనార్హం.

ముంబయిలో కొత్తగా 3,568 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదైంది. 

గత వారం రోజులుగా దేశ రాజధాని దిల్లీలో కేసులు తగ్గుతున్నాయి. కానీ, ఆదివారం ఆ ట్రెండ్‌ బ్రేక్‌ అయ్యింది. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి 11,486కు చేరింది. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది జూన్‌ 5 తర్వాత ఈ స్థాయి మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు మాత్రం 21.48% నుంచి 16.36% పడిపోయింది.

కేరళలో వైరస్‌ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారీ కేసుల సంఖ్య 30 వేల మార్క్‌ను దాటింది. కొత్తగా 30,744 కేసులు రికార్డయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని