India-Nepal: నేపాల్‌కు భారత్‌ ఆపన్న హస్తం.. భూకంప బాధితుల కోసం సహాయక సామగ్రి

నేపాల్‌ (Nepal) భూకంప (earthquake) బాధితులను ఆదుకునేందుకు భారత్ సహాయక సామగ్రి పంపించింది. నేపాల్‌లోని భారత రాయబారి నవీన్‌ శ్రీవాత్సవ వాటిని అక్కడి అధికారులకు అందజేశారు. 

Published : 05 Nov 2023 22:14 IST

దిల్లీ: నేపాల్‌లో (Nepal) శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం (earthquake) కారణంగా తీవ్ర ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు దేశానికి భారత్‌ ఆపన్న హస్తం అందించింది. బాధితులకు అవసరమైన మందులు, ఇతర సహాయక సామగ్రిని పంపించింది. భారత వాయుసేనకు చెందిన విమానంలో వాటిని తరలించింది. ‘‘నేపాల్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సాయాన్ని పంపించాం. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ‘పొరుగువారికి తొలి ప్రాధాన్యం’ విధానంలో భాగంగా భారత్ తొలుత ప్రతిస్పందించి ఔషధాలు, ఇతర ఉపశమన సామగ్రిని అందజేస్తోంది’’ అని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు పెట్టారు. ఈ సహాయ సామగ్రిని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్‌ శ్రీవాత్సవ అక్కడి అధికారులకు అందజేశారు. 

నేపాల్‌లో మరోసారి భూకంపం!

నేపాల్‌లో భారీ భూకంపం తీవ్రతకు 157 నిండు ప్రాణాలు బలైపోయాయి. శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. వాయవ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తులో గాయాలపాలైన 150 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు. ఇళ్లు నేలమట్టమైన ఘటనల్లో రుకమ్‌, జజర్‌కోట్‌ జిల్లాలు ఎక్కువగా.. శనివారం సాయంత్రం వరకు 159 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌ భూకంప తీవ్రతకు భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. దిల్లీతోపాటు యూపీ, బిహార్‌లలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు ఉలిక్కిపడి ఇళ్లనుంచి బయటకు వచ్చేశారు. నేపాల్‌ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని