Akash NG missile: ఆకాశ్‌ ఎన్‌జీ పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌ ఎన్‌జీని విజయవంతంగా పరీక్షించారు. దీంతో యూజర్‌ ట్రయల్స్‌కు మార్గం సులభమైంది.

Updated : 12 Jan 2024 19:15 IST

Akash NG missile ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి ఆకాశ్‌-ఎన్‌జీని నేడు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌) నుంచి దీనిని ప్రయోగించారు. తక్కువ ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవ రహిత విమానాన్ని ఇది ధ్వంసం చేసింది. త్వరలోనే మన రక్షణ బలగాలు దీనిని పరీక్షించడానికి (యూజర్‌ ట్రయల్స్‌) మార్గం సుగమమైంది.

ఆకాశ్‌ ఎన్‌జీ 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ‘‘నేటి పరీక్షల్లో లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకొని పేల్చివేసింది. ఆకాశ్‌ పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును అంచనా వేశాం. దీనిలో దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌, లాంచర్‌, మల్టీఫంక్షన్‌ రాడార్‌, కమాండ్‌-కంట్రోల్‌-కమ్యూనికేషన్‌ వ్యవస్థలను అమర్చారు’’ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

వాణిజ్య నౌకలకు రక్షణగా భారత యుద్ధ నౌకలు

ఈ పరీక్షను పలు రాడార్లు, టెలిమెట్రీ, ఎలక్ట్రో-ఆప్టికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌లు అత్యంత జాగ్రత్తగా పరిశీలించి డేటాను సేకరించాయి. దీంతోపాటు డీఆర్‌డీవో, వాయుసేన, బీడీఎల్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ అధికారులు పర్యవేక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవోతోపాటు ఇతర అధికారులను అభినందించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని ఇది పెంచిందన్నారు. 

గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దీనిని పరీక్షించగా అన్ని వ్యవస్థలూ చక్కగా పనిచేశాయి. దీనిలో డ్యూయల్‌ పల్స్‌ సాలిడ్‌ రాకెట్‌ మోటార్లను వినియోగించారు. భారత వాయుసేన, ఆర్మీ దీనిని వినియోగించనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని