Arabian Sea: వాణిజ్య నౌకలకు రక్షణగా భారత యుద్ధ నౌకలు

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలకు రక్షణగా భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలను ఆ ప్రాంతంలో మోహరించినట్లు సైనికాధికారులు తెలిపారు.

Updated : 12 Jan 2024 15:50 IST

దిల్లీ: అరేబియా సముద్రంలో గత వారం హైజాక్‌కు గురైన నౌకలోని సిబ్బందిని భారత నావికా దళానికి చెందిన మెరైన్‌ కమాండోలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి  కాపాడారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో సోమాలియా పైరెట్లను, డ్రోన్‌ దాడులను అడ్డుకునేందుకు భారత నావికాదళం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అరేబియా సముద్రం, ఏడెన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఆరు నుంచి 10 ప్రధాన యుద్ధ నౌకలను మోహరించినట్లు సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. సముద్రంలో ప్రతి కదలికను ఇవి నిశితంగా గమనిస్తున్నాయని, ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా తక్షణం స్పందించే విధంగా సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య నౌకలకు రక్షణగా ఇవి నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి.

గత వారం 15 మంది భారతీయులు సహా 21 మంది సిబ్బంది ఉన్న ఎం.వి. లీలా నార్‌ఫోన్‌ నౌకను సోమాలియా పైరెట్లు హైజాక్‌ చేశారు. వెంటనే భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై డిస్ట్రాయర్‌ నౌకను, యుద్ధ విమానాన్ని రంగంలోకి దింపింది. నౌకలోకి మెరైన్‌ కమాండోలు ప్రవేశించి  సిబ్బందిని కాపాడారు.

యెమెన్‌లో 16 చోట్ల 60 లక్ష్యాలపై గురి.. అమెరికా వాయుసేన ప్రకటన

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి నిరసనగా.. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా గత కొన్ని వారాలుగా హౌతీ రెబల్స్‌ దాడులు చేస్తున్నారు. వారికి మద్దతుగా కొందరు పైరెట్లు అరేబియా సముద్రంలో నౌకలను హైజాక్‌ చేస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం  హౌతీ రెబల్స్‌పై ప్రతీకార దాడులు నిర్వహించాయి. యెమెన్‌లో వారి అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని