భారత్‌తో వివాదం వేళ.. మాల్దీవుల దిశగా చైనా పరిశోధక నౌక

భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు(India maldives conflict) నెలకొన్న వేళ హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరిగాయి. 

Updated : 23 Jan 2024 11:21 IST

దిల్లీ: భారత్‌-మాల్దీవుల మధ్య వివాదం రాజుకొన్న వేళ.. హిందూ మహాసముద్రంలో చైనా పరిశోధక నౌక కదలికలు చర్చనీయాంశంగా మారాయి. మాలె దిశగా ప్రయాణిస్తున్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్‌ 03’ నౌకపై మన నేవీ( Indian Navy) దృష్టిసారించింది. అది అక్కడున్న విషయం తమకు తెలుసని అధికారులు మీడియాకు వెల్లడించారు. దాని కదలికల్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఇండియన్ ఈఈజెడ్‌(EEZ)లో దాని కార్యకలాపాలు మొదలైనట్లు ఇంకా తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. కొన్ని వారాల్లో ఇది మాల్దీవుల(Maldives) తీరానికి చేరుతుందని సమాచారం.  గతంలో ఇదే తరహా నౌక శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. (India maldives conflict)

2019లో భారత ఈఈజెడ్‌లోకి అనుమతి లేకుండా చైనా నౌక ప్రవేశించింది. ఆ వెంటనే మనం దానిని తరిమివేశాం. ఈ తరహా చైనా నౌకలు గతేడాది వరకు శ్రీలంకలో లంగరేశాయి.  కానీ, ఈ సారి కొలంబో ఇందుకు అంగీకరించ లేదు. ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించనవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని సాధనాలు నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది. అయితే, తమ పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని గతంలో భారత్‌ను ఉద్దేశించి చైనా వ్యాఖ్యానించింది. 

మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌.. చైనా అనుకూల పార్టీగా పేరుగాంచింది. దానికి తగ్గట్టే ఆయన భారత్‌తో వివాదం వేళ.. బీజింగ్‌లో పర్యటించారు. తమ దేశంలోని సైన్యాన్ని వాపస్‌ తీసుకోవాలని భారత్‌ను కోరారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని