IndiGo: ల్యాండింగ్‌ సమయంలో నేలను తాకిన విమానం తోక..

దిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ ఇండిగో విమానం (Indigo aircraft) ల్యాండ్‌ అయ్యే సమయంలో దాని తోక భాగం నేలను తాకింది. దీంతో విమానం దెబ్బతింది. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.

Updated : 13 Jun 2023 15:02 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఓ ఇండిగో విమానానికి (Indigo aircraft) త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో విమానం ల్యాండ్‌ అవుతుండగా దాని తోక భాగం నేలను తాకింది (tail strike). అయితే పైలట్ల అప్రమత్తతతో అది సురక్షితంగా దిగింది. ఈ ఘటనతో విమానం దెబ్బతినడంతో దాని సర్వీసులను నిలిపివేశారు.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 11న కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో వీటీ-ఐఎంజీ విమానం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport)లో ల్యాండ్‌ అవుతుండగా.. తోక భాగం రన్‌వే నేలను తాకింది. అయితే, విమానం సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై డీజీసీఏ (DGCA) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘విమానం (IndiGo Aircraft) ల్యాండ్‌ అయ్యేంతవరకు ఏ సమస్యా తలెత్తలేదు. రన్‌వేను సమీపిస్తుండగా.. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలట్లు గుర్తించారు. అలాగే ల్యాండింగ్‌ ప్రక్రియను ఆరంభించారు. అయితే విమానం దిగే సమయంలో దాని తోకభాగం రన్‌వే నేలను తాకింది’’ అని డీజీసీఏ వెల్లడించింది. ఘటన కారణంగా విమానం వెనుకభాగం దెబ్బతింది. దీంతో దాని సేవలను నిలిపివేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. అప్పటిదాకా విమానం నడిపిన పైలట్లను కూడా విధుల నుంచి పక్కనబెట్టినట్లు పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు