cryptocurrency: చట్టం తేకుండా క్రిప్టోపై పన్ను వేయడమేంటి? కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్‌!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొనడం రాజకీయ దుమారానికి దారితీసింది.

Published : 02 Feb 2022 01:23 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొనడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేశారా? అంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు.

దేశంలో వర్చువల్‌ డిజిటల్‌ కరెన్సీ లావాదేవీలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, అందుకే పన్ను విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు 1 శాతం టీడీఎస్‌ విధించనున్నట్లు చెప్పారు. వర్చువల్‌ ఆస్తులను గిఫ్ట్‌ రూపంలో అందించినా అదే ట్యాక్స్‌ వర్తిస్తుందని స్పష్టంచేశారు.

దీనిపై కాంగ్రెస్‌ నేత సూర్జేవాలా స్పందించారు. ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేశారా? అని ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ బిల్లు తేకుండా పన్ను ఎలా వేశారని ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. రెగ్యులేషన్‌ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్ఛేంజీల నియంత్రణ మాటేంటి? ఇన్వెస్టర్ల రక్షణ సంగతి ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించినప్పటికీ.. దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, ఇంతకుముందు కూడా దీనిపై ఎలాంటి చర్చా జరగలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందు క్రిప్టో కరెన్సీ గురించి తీవ్ర చర్చ జరిగింది. ఆ సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ప్రభుత్వం ఎందుకో ఆగిపోయింది. మరోవైపు క్రిప్టో కరెన్సీపై ఆర్‌బీఐ సైతం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో బడ్జెట్‌లో డిజిటల్‌ కరెన్సీపై పన్ను వేయడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని