Arvind Kejriwal: అది ఫేక్‌ కేసు.. నిజమైతే నేనే చర్యలు తీసుకునేవాడిని: కేజ్రీవాల్‌

రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై మోపిన కేసు పూర్తి నకిలీదని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు...

Published : 31 May 2022 14:30 IST

దిల్లీ: రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టు విషయంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై మోపిన కేసు పూర్తి నకిలీదని, అది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు. తమ పార్టీ, ప్రభుత్వాలు నిజాయతీకి కట్టుబడి ఉన్నాయని.. అవినీతిని సహించవని స్పష్టం చేశారు. ఈ కేసులో జైన్‌పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైనా నిజమని తేలి ఉంటే తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని తెలిపారు. దిల్లీలో మంగళవారం రోడ్డు అభివృద్ధి పనుల తనిఖీ సందర్భంగా కేజ్రీవాల్‌ విలేకరులతో మాట్లాడారు.

అవినీతి ఆరోపణలపై ఇటీవల పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ తన మంత్రివర్గం నుంచి తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను తొక్కిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ఆప్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని, మంత్రిని అరెస్టు చేసిందని చెప్పారు. అయిదేళ్ల క్రితం సైతం దిల్లీలో మంత్రిని తొలగించి, సీబీఐకి స్వయంగా లేఖ రాసిన విషయాన్ని ఉటంకించారు. తాము దర్యాప్తు సంస్థల కోసం వేచి చూడమని, స్వయంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పైగా, కేంద్ర దర్యాప్తు సంస్థల అనేక కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు.

జైన్‌ కేసును తాను స్వయంగా అధ్యయనం చేసినట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ‘ఇది పూర్తిగా నకిలీ, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు. మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. జైన్ సత్య మార్గంలో నడుస్తున్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఈడీ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. త్వరలో తమ మంత్రి జైన్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. జనవరిలోనే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని